Bojjala Gopala Krishna Reddy: బొజ్జల మృతికి చంద్రబాబు, లోకేశ్ సంతాపం

- అనారోగ్యంతో కన్నుమూసిన బొజ్జల
- బొజ్జల మరణం అత్యంత బాధాకరమన్న చంద్రబాబు
- బొజ్జలను రాజనీతిజ్ఞుడిగా, వ్యూహకర్తగా అభివర్ణించిన లోకేశ్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం ప్రకటించారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్న బొజ్జల శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
రెండు రోజుల క్రితం ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబు... బొజ్జల మరణించే సమయానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. బొజ్జల మృతి వార్త తెలిసినంతనే తీవ్ర ఆవేదనకు గురైన చంద్రబాబు... బొజ్జల మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. లాయర్‌గా వృత్తి జీవితం ప్రారంభించిన బొజ్జల..ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు బొజ్జల నిత్యం అందుబాటులో ఉండేవారని తెలిపారు.
బొజ్జల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించిన చంద్రబాబు.. బొజ్జల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న నేపథ్యంలో బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డికి ఫోన్ చేసిన చంద్రబాబు ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవలే నేరుగా బొజ్జల నివాసానికి వెళ్లిన ఆయనను పరామర్శించిన ఫొటోను చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
