Congress: కాంగ్రెస్ ట్విట్టర్‌ను బ్లాక్ చేసిన కేటీఆర్... తోక ముడిచారన్న హస్తం పార్టీ
- సమాధానం చెప్పలేకేనంటూ కాంగ్రెస్ సెటైర్
- కేటీఆర్‌పై సోషల్ మీడియాలో విమర్శల వర్షం
- గతంలో రేవంత్ చేసిన ఇదే పనిని వెలికి తీసిన గులాబీ దళం
- కాంగ్రెస్‌కు ఘాటుగా బదులిస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు
- సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ
కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ సెటైర్లు సంధించింది. ప్రజల తరఫున తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కారణంగానే కేటీఆర్ తన ఖాతాను బ్లాక్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది.
ప్రశ్నను చూసి కేటీఆర్ గజగజ వణికిపోయారని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఓ జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్‌నే బ్లాక్ చేయడంతో కేటీఆర్ మానసిక స్థితి ఏమిటో ఇట్టే తెలిసిపోతోందని కూడా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ కాసేపటి క్రితం ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌పెట్టింది.
ఇదిలా ఉంటే... కేటీఆర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ చెప్పిన మాట నిజమేనని, ఆ పార్టీ అడిగే ప్రశ్నలకు బదులివ్వలేకే కేటీఆర్ ఆ పార్టీ ట్విట్టర్‌ను బ్లాక్ చేశారంటూ పోస్టులు పెడుతున్నారు.
అదే సమయంలో కేటీఆర్ నిర్ణయాన్ని సమర్థించే క్రమంలో కొందరు గతంలో టీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్‌ను బ్లాక్ చేసిన రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వెలుగులోకి తీసుకువస్తూ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు సంధిస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్‌ను బ్లాక్ చేస్తూ కేటీఆర్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.