Kagiso Rabada: రబాడాకు 4 వికెట్లు... పంజాబ్ ముందు ఈజీ టార్గెట్
- ఐపీఎల్ ప్లే ఆఫ్ బెర్తుల కోసం పోటీ తీవ్రం
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు
- 64 రన్స్ తో అజేయంగా నిలిచిన సాయి సుదర్శన్
ఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ రేసుకు పోటీ పెరిగిపోతున్న నేపథ్యంలో, పంజాబ్ కింగ్స్ బౌలర్లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ తో గుజరాత్ టైటాన్స్ ను కట్టడి చేశారు. కగిసో రబాడా 4 వికెట్లు తీసి గుజరాత్ ను స్వల్పస్కోరుకు పరిమితం చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది.
యువ ఆటగాడు సాయి సుదర్శన్ 50 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 21 పరుగులు సాధించాడు. సాహా స్కోరులో 3 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. వీరిద్దరు తప్ప మరెవ్వరూ రాణించకపోవడంతో గుజరాత్ భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు. పంజాబ్ పేసర్ రబాడా ఆఖర్లో విజృంభించడంతో గుజరాత్ ఆటగాళ్లు స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 1, రిషి ధావన్ 1, లియామ్ లివింగ్ స్టోన్ 1 వికెట్ తీశారు.