Akshaya tritiya: అక్షయ తృతీయ.. బంగారం ఇలానూ కొనుగోలు చేసుకోవచ్చు!

What we need to know about buying gold on Akshaya tritiya

  • భౌతిక బంగారం లేదంటే డిజిటల్ రూపంలో
  • కాయిన్లు, ఆభరణాలుగా తీసుకోవచ్చు
  • అందుబాటులో గోల్డ్ ఈటీఎఫ్ లు, గోల్డ్ మ్యాచువల్ ఫండ్స్
  • గోల్డ్ బాండ్లు కూడా ఆకర్షణీయమే

అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే.. స్వయంగా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్టుగా చాలా మంది హిందువులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఇదొక పర్వదినం. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియ రోజే అక్షయ తృతీయ. ఈ రోజున బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారి ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి.

బంగారాన్ని భౌతిక రూపంతోపాటు, డిజిటల్ రూపంలో కొనుగోలు చేసుకునే మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అందులో గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (గోల్డ్ ఈటీఎఫ్) కూడా ఒకటి. ఇవి స్టాక్ ఎక్సేంజ్ లలో ట్రేడ్ అవుతుంటాయి. షేర్ల మాదిరే వీటిలో క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. 

గోల్డ్ మ్యాచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని తీసుకెళ్లి బంగారంలో ఇన్వెస్ట్ చేస్తాయి. తమ ఖర్చులు (ఎక్స్ పెన్స్ రేషియో) పోను మిగిలినది రాబడి రూపంలో ఇన్వెస్టర్లకు పంచుతాయి.

కేంద్ర ప్రభుత్వం సావరీన్ గోల్డ్ బాండ్లు (ఎస్ జీబీ) పేరుతో ఒక పథకాన్ని నిర్వహిస్తోంది. ఏటా నాలుగు పర్యాయాలు ఎస్ జీబీలను ఆర్ బీఐ విక్రయిస్తుంటుంది. అప్పటి మార్కెట్ ధర ప్రకారం బంగారం ధరను నిర్ణయిస్తుంటుంది. పెట్టుబడి పెట్టేనాటి విలువ ఆధారంగా ఏటా 2.5 శాతం వడ్డీ ఇన్వెస్టర్లకు లభిస్తుంది. 8 ఏళ్ల కాల వ్యవధి ముగిసే వరకు ఉంచుకుంటే రాబడిపై పన్ను లేదు.

ఇక పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే సంస్థలు డిజిటల్ గోల్డ్ ను ఆఫర్ చేస్తున్నాయి. డిజిటల్ గోల్డ్ ను రూపాయి నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు విక్రయించుకోవచ్చు. బ్యాంకులు, ఈ కామర్స్ సంస్థల నుంచి బంగారం కాయిన్లను కూడా కొనుగోలు చేసుకోవచ్చు. 22, 24 కేరట్ల బంగారం కాయిన్లు లభిస్తాయి. 

ఇలా కాకుండా జ్యుయలరీ షాపునకు వెళ్లి ఏదైనా ఆభరణం కొనుగోలు చేసేట్టు అయితే.. దానిపై హాల్ మార్క్ ఉందా? అనేది నిర్ధారించుకోవాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా హాల్ మార్క్ ఉన్న ఆభరణాలనే విక్రయించాల్సి ఉంటుంది. 2021 జూన్ 16 నుంచే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది.

More Telugu News