Rajasthan Royals: ఐదు వరుస పరాజయాలకు అడ్డుకట్ట.. రాజస్థాన్‌పై కోల్‌కతా విజయం

Rinku Singh and Nitish Rana Power KKR to Win

  • భారీ స్కోరు సాధించడంలో విఫలమైన రాజస్థాన్ రాయల్స్
  • రాజస్థాన్‌పై అలవోకగా విజయం సాధించిన కేకేఆర్
  • ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా రింకు సింగ్ 

కోల్‌కతా పరాజయాలకు బ్రేక్ పడింది. ఐదు వరుస పరాజయాల తర్వాత ఆ జట్టును విజయం వరించింది. గత రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలుత రాజస్థాన్‌ను 152 పరుగులకు కట్టడి చేసిన కేకేఆర్ ఆ తర్వాత మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. 

16 పరుగులకే అరోన్ ఫించ్ (4) వికెట్‌ను, 32 పరుగుల వద్ద బాబా ఇంద్రజిత్ (15) వికెట్‌ను కోల్పోయినప్పటికీ ఆ తర్వాతి బ్యాటర్లు చక్కని భాగస్వామ్యాలు నెలకొల్పడంతో అలవోకగా విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 34 పరుగులు చేయగా, నితీశ్ రాణా 48, రింకు సింగ్ 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. కోల్‌కతా బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ సేన్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్‌ను కోల్‌కతా బౌలర్లు 152 పరుగులకు కట్టడి చేశారు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టమైంది. కావాల్సినన్ని వికెట్లు చేతిలో ఉన్నా భారీ స్కోరు సాధించడంలో ఆర్ఆర్ బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ సంజు శాంసన్ మాత్రం 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బట్లర్ 22, కరుణ్ నాయర్ 13, రియాన్ పరాగ్ 19, హెట్మెయిర్ 27 పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

కోల్‌కతా బౌలర్లలో సౌథీకి రెండు వికెట్లు దక్కగా, ఉమేశ్ యాదవ్, అనుకుల్ రాయ్, శివం మావీ తలా ఓ వికెట్ పడగొట్టారు. 23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 42 పరుగులు చేసిన కేకేఆర్ బ్యాటర్ రింకు సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో నేడు గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Rajasthan Royals
Kolkata Knight Riders
Rinku Singh
IPL 2022
  • Loading...

More Telugu News