Warren Buffett: మొత్తం బిట్ కాయిన్లు 25 డాలర్లకు ఇస్తానన్నా నాకొద్దు: వారెన్ బఫెట్
- వాటితో వచ్చే ఉత్పత్తి ఏమీ ఉండదు
- అది ఒక అస్సెట్ కానే కాదు
- అపార్ట్ మెంట్లు అయితే అదనంగా పెట్టి అయినా కొంటా
- వాటిపై అద్దె ఆదాయం వస్తుందన్న విఖ్యాత ఇన్వెస్టర్
క్రిప్టో కరెన్సీల పట్ల తన వ్యతిరేకతను సుప్రసిద్ధ ఇన్వెస్టర్, పెట్టుబడుల నిపుణుడు, బెర్క్ షైర్ హాత్ వే కంపెనీ చైర్మన్ వారెన్ బఫెట్ చాటుకున్నారు. ఇది ఏ మాత్రం ఉత్పత్తికి తోడ్పడే సాధనం కాదన్నారు. బిట్ కాయిన్లు అన్నింటినీ తీసుకొచ్చి 25 డాలర్లకు ఇచ్చినా తాను తీసుకోబోనని ఆయన స్పష్టం చేశారు. అసెట్స్ (ఆస్తులు/సాధనాలు) అంటే విలువ కలిగినవి అని బఫెట్ నిర్వచనం. తాను ఒక్క కరెన్సీనే ఆమోదిస్తానంటూ, అది బిట్ కాయిన్ మాత్రం కాదన్నారు.
‘‘ప్రపంచంలోని బిట్ కాయిన్లు అన్నీ నా దగ్గరే ఉన్నాయి, వాటిని 25 డాలర్లకు తీసుకోవాలంటూ ఆఫర్ చేస్తే నేను తీసుకోను. వాటితో నేను ఏం చేయాలి? బిట్ కాయిన్ పెరగొచ్చు. లేదా వచ్చే ఏడాది తగ్గొచ్చు. కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఇది దేనినీ ఉత్పత్తి చేయదు. మళ్లీ తిరిగి విక్రయించాలి.
అమెరికాలో ఉన్న మొత్తం అపార్ట్ మెంట్ ఇళ్లల్లో ఒక్క శాతాన్ని నాకిచ్చేస్తానంటే.. అందుకు మీరు మరో 25 బిలియన్ డాలర్లు కావాలని కోరినా నేను చెక్కు రాసి ఇస్తాను . ఎందుకంటే అపార్ట్ మెంట్లపై అద్దె ఆదాయం వస్తుంది. సాగు భూములు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి’’ అని బఫెట్ తన విధానమేంటో చెప్పారు. వారెన్ బఫెట్ భావోద్వేగాలకు లోనయ్యే వ్యక్తి కారు. ఎంతో విశ్లేషణ తర్వాతే పెట్టుబడి పెడతారు. అవసరమైతే వాటిని సుదీర్ఘ కాలం కొనసాగిస్తారు.