iPhone: ఇంట్లోనే ఐఫోన్ రిపేర్.. యాపిల్ కొత్త ఆఫర్
- విడిభాగాలు, టూల్స్ ను సరఫరా చేయనున్న యాపిల్
- మాన్యువల్ చూసి యూజర్లే రిపేర్ చేసుకోవచ్చు
- అమెరికాలో మొదలైన కొత్త సేవ
- ఇతర దేశాలకూ త్వరలో విస్తరణ
ఆశ్చర్యంగానే అనిపించినా ఇది నిజం. ఐఫోన్ యూజర్లు ఇంట్లో నుంచే తమ ఐఫోన్ ను రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిన సహకారాన్ని యాపిల్ అందిస్తుంది. ఈ కార్యక్రమం పేరు ‘సెల్ఫ్ సర్వీస్ రిపేర్’. దీని కింద యూజర్లకు కంపెనీ మాన్యువల్, విడి భాగాలను సరఫరా చేస్తుంది. టూల్స్ కూడా అందిస్తుంది. వీటి సాయంతో యూజర్లు తమ ఇంటి నుంచే మాన్యువల్ చూసి రిపేర్ చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి అమెరికా మార్కెట్లోనే ఇది ప్రారంభమైంది. ఇతర దేశాలకు కూడా దీన్ని విస్తరించనున్నట్టు యాపిల్ ధ్రువీకరించింది. ఈ ఏడాది చివరికి ఐరోపాలో ఇది మొదలవుతుందని ప్రకటించింది. భారత్ కూడా ముఖ్యమైన మార్కెట్ కావడంతో మరో ఏడాదిలో ఇక్కడ కూడా యాపిల్ సెల్ఫ్ సర్వీస్ రిపేర్ మొదలవుతుందని భావించొచ్చు.
యాపిల్ 200కు పైగా విడిభాగాలను సెల్ఫ్ సర్వీస్ కోసం సరఫరా చేస్తుంది. ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ ఎస్ఈ 3 మోడళ్లకు సంబంధించి స్క్రీన్, బ్యాటరీ, కెమెరాలో సమస్యలను సరిచేసుకోవచ్చు. అంతేకాదు మ్యాక్ కంప్యూటర్లకు సైతం మ్యానువల్స్, విడిభాగాలు, టూల్స్ ను కూడా త్వరలో సరఫరా చేయనున్నట్టు యాపిల్ తెలిపింది.
యూజర్లు ముందుగా support.apple.com/self-service-repair పోర్టల్ కు వెళ్లి తాము రిపేర్ చేయదలుచుకున్న ఉత్పత్తి మ్యానువల్ ను చదవాలి. ఆ తర్వాత యాపిల్ సెల్ఫ్ సర్వీస్ రిపేర్ స్టోర్ కు వెళ్లి ఆర్డర్ చేయాలి. అప్పుడు రిపేర్ కు అవసరమైన విడిభాగాలు, టూల్స్ ను గూగుల్ సరఫరా చేస్తుంది. ఇందుకు అవసరమైన మేర చెల్లించాల్సి వస్తుంది.