Bride: పెళ్లి విషయంలోనూ టైమింగ్ లేకపోతే ఎలా..? వరుడికి షాకిచ్చిన వధువు
- 4 గంటలకు పెళ్లి ముహూర్తం
- పీకల దాకా తాగి రాత్రి 8 తర్వాత వచ్చిన వరుడు
- పెళ్లికి నిరాకరించిన వధువు తండ్రి
- బంధువుకు కన్యాదానంతో ముగిసిన వేడుక
టైమ్ సెన్స్ అన్నది కొన్ని సందర్భాల్లో లేకపోయినా నష్టం ఏమీ ఉండదు.. కానీ, కొన్ని సందర్భాల్లో అనుకోని నష్టం చూడాల్సి వస్తుంది. ఉదాహరణకు నిర్ణీత సమయానికి 5-10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారనుకుంటే రైలు, విమానం వెళ్లిపోవచ్చు కూడా. ఇలాగే ఓ వ్యక్తి వివాహం విషయంలోనూ జరిగింది. పెద్దలు నిర్ణయించిన ముహూర్త సమయానికి వరుడు పెళ్లి వేడుకకు చేరుకోలేకపోయాడు. మద్యం మత్తులో మునిగిపోయాడు. ఈ విషయం వధువు తండ్రికి తెలిసింది. ప్రతిష్ఠాత్మకంగా భావించాడు. అదే పెళ్లి వేడుకలో తన బంధువుకు కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు.
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఇది చోటు చేసుకుంది. మల్కాపూర్ పంగ్రా గ్రామంలో ఏప్రిల్ 22న పెళ్లి ముహూర్తం. సాయంత్రం 4 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వధువు, ఆమె తరపు బంధు మిత్రులు అందరూ వరుడు ఇక వస్తాడులే అనుకుంటూ రాత్రి 8 గంటల వరకు చూశారు. ఆ తర్వాత వరుడు మద్యం సేవించి డ్యాన్స్ చేస్తూ పెళ్లి మంటపానికి చేరుకున్నాడు. అతడ్ని చూసిన వధువు తండ్రికి చిర్రెత్తుకొచ్చింది. తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించాడు. పెళ్లి చూడ్డానికి వచ్చిన బంధువుకు ఇచ్చి కల్యాణం జరిపించాడు. దీంతో వరుడికి మద్యం మత్తు దిగిపోయింది.