Delhi Capitals: కేకేఆర్‌ను వెంటాడుతున్న వరుస పరాజయాలు.. ఢిల్లీ చేతిలోనూ చిత్తు

Kuldeep consigns KKR to fifth consecutive defeat
  • వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైన కేకేఆర్
  • ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
  • సంచలన స్పెల్‌తో కేకేఆర్‌కు చుక్కలు చూపిన కుల్దీప్ యాదవ్
ఐపీఎల్ ఆరంభంలో అదరగొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పుడు చతికిలపడింది. వరుస పరాజయాలతో కిందికి జారిపోతోంది. ఢిల్లీ కేపిటల్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన కేకేఆర్ వరుసగా ఐదో  పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొత్తంగా ఆరోది. ఫలితంగా 8వ స్థానానికి పడిపోయి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్ఠం చేసుకుంది. తొలుత కుల్దీప్ యాదవ్ చెలరేగడంతో కేకేఆర్ 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది.

147 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ ఇన్నింగ్స్ తొలి బంతికే పృథ్వీషా (0) వికెట్‌ను కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన మిచెల్ మార్ష్ (13) కూడా క్రీజులో నిలవలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన లలిత్ యాదవ్‌తో కలిసి డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 26 బంతుల్లో 8 ఫోర్లతో 42 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపించాడు. కెప్టెన్ రిషభ్ పంత్ రెండు పరుగులు మాత్రమే చేసి అవుటైనా లలిత్ యాదవ్ (22), రోవ్‌మన్ పావెల్ (33), అక్షర్ పటేల్ (24) రాణించడంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. రిషభ్ సేనకు ఇది నాలుగో విజయం. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా ఎడమచేతివాటం రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ధాటికి విలవిల్లాడింది. కుల్దీప్ యాదవ్ కేవలం 14 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడంతో కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ తన సంచలన స్పెల్ లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (42), బాబా ఇంద్రజిత్ (6), సునీల్ నరైన్ (0), ఆండ్రీ రస్సెల్ (0)లను పెవిలియన్ చేర్చి కోల్ కతాను గట్టి దెబ్బకొట్టాడు. 

అయితే మిడిలార్డర్ లో నితీశ్ రాణా (57), లోయరార్డర్ లో రింకు సింగ్ (23) రాణించడంతో కోల్ కతా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మరోవైపు లెఫ్టార్మ్ సీమర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ కచ్చితత్వంతో కూడిన బంతులు వేయడంతో కోల్ కతా ఆఖరి ఓవర్లలో ధాటిగా ఆడలేకపోయింది. కోల్ కతా జట్టులో నితీశ్ రాణా, శ్రేయాస్ అయ్యర్, రింకు సింగ్ మినహా మిగిలినవాళ్లు దారుణంగా విఫలమయ్యారు. నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు పంజాబ్ కింగ్స్- లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి.
Delhi Capitals
Kolkata Knight Riders
Kuldeep Yadav
IPL 2022

More Telugu News