KCR: అప్పట్లో నన్ను జైల్లో పెట్టారు.. ఇప్పుడు అది కేటీఆర్ ఫాంహౌస్ కాదన్న వాదనకు అనుకూలమైన తీర్పు వచ్చింది: రేవంత్ రెడ్డి
- జన్వాడ ఫామ్‌హౌస్ డ్రోన్ కేసుపై రేవంత్ రెడ్డి ట్వీట్
- పోలీసులు అక్కడ కేటీఆర్ నివాసం ఉంటున్నారని అన్నారని వ్యాఖ్య
- ఆయన ప్రాణాలకు హాని తలపెట్టానని కోర్టుకు నివేదించారన్న రేవంత్
- నిజం ప్రజా కోర్టు తేల్చాలన్న టీపీసీసీ అధ్యక్షుడు
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ''జన్వాడ ఫామ్‌హౌస్ డ్రోన్ కేసులో నన్ను జైల్లో పెట్టారు. పోలీసులు అక్కడ కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నివాసం ఉంటున్నారని ఆయన ప్రాణాలకు హాని తలపెట్టానని కోర్టుకు నివేదించారు. హైకోర్టులో కేటీఆర్ ఫాంహౌస్ తనది కాదన్న వాదనకు అనుకూలమైన తీర్పు వచ్చింది. నిజం ప్రజా కోర్టు తేల్చాలి'' అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ఓ దినపత్రికలో వచ్చిన వార్తను రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల క్యాచ్‌మెంట్ ఏరియాల్లో జీవో 111 రూల్స్‌ను ఉల్లంఘించి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టారంటూ రేవంత్‌రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) చెన్నై బెంచ్‌లో దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని హైకోర్టు తేల్చిందని అందులో పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను, ఎన్‌జీటీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కేటీఆర్, ఫామ్‌హౌస్ యజమాని ప్రదీప్‌రెడ్డి విడివిడిగా వేసిన రిట్లను అనుమతిస్తూ జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావ్‌ల డివిజన్ బెంచ్ తీర్పు చెప్పిందని అందులో వివరించారు.