Bonda Uma: రోజా, వాసిరెడ్డి పద్మపై బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు
- రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని ఉమ హెచ్చరిక
- ఇకనైనా రోజా సొల్లు మాటలు చెప్పడం మానుకోవాలని వ్యాఖ్య
- మహిళా కమిషన్‌కు ఉన్న అధికారాల గురించి వాసిరెడ్డి పద్మ చదివారా? అని ప్రశ్న
- మేకప్ వేసుకుని తీర్పులు చెప్పొచ్చని అనుకుంటున్నారేమో అని ఎద్దేవా
ఇటీవల విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ యువతి కుటుంబానికి టీడీపీ రూ.5 లక్షల చెక్కును అందించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత బోండా ఉమ ఏపీ మంత్రి రోజాపై మండిపడ్డారు. రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని, వనజాక్షి, కాల్ మనీ సెక్స్ రాకెట్ అంటూ టీడీపీపై విమర్శలు చేయడం ఏంటని నిలదీశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా.. ఇన్నాళ్లూ ఏం చేశారని ఆయన నిలదీశారు. ఇకనైనా రోజా సొల్లు మాటలు చెప్పడం మానుకోవాలని, వైసీపీ ప్రభుత్వ పాలనలో 800 మంది మహిళలపై దాడులు జరిగితే ఏం చేశారని ఆయన నిలదీశారు. విజయవాడ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతి కుటుంబానికి టీడీపీ అండగా ఉందని, అందుకే మహిళా కమిషన్ నుంచి తమకు నోటీసులు ఇచ్చారని ఆయన అన్నారు.
అసలు మహిళా కమిషన్‌కు ఉన్న అధికారాల గురించి వాసిరెడ్డి పద్మ చదివారా? అని ఆయన ప్రశ్నించారు. ఆమె రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని, ఆ పదవి నుంచి ఆమెను తప్పించాలని సీఎస్, జాతీయ మహిళా కమిషన్‌ను కోరుతున్నామని అన్నారు. వాసిరెడ్డి పద్మ మేకప్ వేసుకుని తీర్పులు చెప్పొచ్చని అనుకుంటున్నారేమో అని ఆయన ఎద్దేవా చేశారు. మహిళా కమిషన్ ఇచ్చిన సమన్ల వల్ల తమ వెంట్రుక కూడా ఊడదని వ్యాఖ్యానించారు.