Twitter: ట్విట్టర్ కు ఉన్న ఏకైక పరిష్కారం ఎలాన్ మస్క్.. ట్విట్టర్ కొనుగోలుపై సంస్థ మాజీ సీఈవో మద్దతు

Jack Dorsey Supports Musk Take Over Of Twitter

  • ట్విట్టర్ సిద్ధాంతం, సేవే తనకు ముఖ్యమన్న జాక్ డోర్సీ 
  • వాటిని కాపాడేందుకు ఏం చేయడానికైనా సిద్ధమని వ్యాఖ్య 
  • ప్రజలకు ట్విట్టర్ ద్వారా మంచి జరగాలంటూ ఆకాంక్ష 

ట్విట్టర్ ను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కొనేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా.. ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ మాత్రం సమర్థిస్తున్నారు. ఇప్పుడు ట్విట్టర్ కు ఉన్న ఏకైక పరిష్కారం ఎలాన్ మస్కేనని అన్నారు. ట్విట్టర్ ను మస్క్ సొంతం చేసుకోవడంపై తాను మద్దతిస్తున్నానన్నారు. దీనికి సంబంధించి ఆయన పలు ట్వీట్లు చేశారు. 

ట్విట్టర్ అంటే ఇష్టమని, ప్రపంచాన్ని మేల్కొల్పేందుకు అదే చాలా దగ్గరి ప్రత్యామ్నాయమని చెప్పారు. ట్విట్టర్ సిద్ధాంతాలు, సేవే తనకు ముఖ్యమన్నారు. ఆ రెండింటినీ కాపాడేందుకు తాను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తనకున్న ఏకైక సమస్య ఎప్పటికీ ట్విట్టరేనని, దాని గురించే తన చింత అని పేర్కొన్నారు. 

ఇంతకుముందు ట్విట్టర్ ను వాల్ స్ట్రీట్, ఓ యాడ్ మోడల్ తీసుకున్నారని, ఆ సంస్థ నుంచి మళ్లీ ట్విట్టర్ ను వెనక్కు తీసుకోవడం తొలి మంచి నిర్ణయని అన్నారు. అయితే, సంస్థ ఎవరో ఒకరి సొంతమనుకోవడం, లేదా ఎవరో ఒకరి చేతుల మీదుగా నడవడమన్న సిద్ధాంతాన్ని తాను అస్సలు నమ్మనని తేల్చి చెప్పారు. అంతిమంగా దాని వల్ల ప్రజలకు మంచి జరగాలన్నారు. అయితే, కంపెనీ పరంగా సమస్యలను పరిష్కరించేందుకు మాత్రం ఇప్పుడున్న ఏకైక మార్గం ఎలాన్ మస్కేనని డోర్సీ స్పష్టం చేశారు. ఆయనపై తనకు గట్టి నమ్మకం ఉందన్నారు.

  • Loading...

More Telugu News