Perni Nani: చిరంజీవికి, పవన్ కల్యాణ్ కు చాలా తేడా ఉంది: పేర్ని నాని

Perni Nani opines on Chiranjeevi and Pawan Kalyan
  • చిరంజీవి దేవుడు అని కొనియాడిన నాని  
  • పవన్ భిన్నమైన వ్యక్తి అంటూ కామెంట్  
  • చంద్రబాబు కోసమే పార్టీ పెట్టాడని విమర్శలు
ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో ముచ్చటిస్తూ... పవన్ కల్యాణ్, చిరంజీవిల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. పవన్ కల్యాణ్ కు ఎంతసేపూ జగన్ పదవి నుంచి దిగిపోవాలి, చంద్రబాబు పైకి లేవాలి అనే బలమైన ఆకాంక్ష తప్ప మరొకటి లేదని వ్యాఖ్యానించారు. పవన్ వ్యక్తిత్వం గురించి చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయని అన్నారు. పవన్ సినిమా నటుడు కాబట్టి అనేక విధాలుగా మాట్లాడుతుంటాడని విమర్శించారు. పవన్ కల్యాణ్ పార్టీ ఏర్పాటు చేసింది చంద్రబాబు కోసమేనని స్పష్టం చేశారు. 

అయితే, చిరంజీవికి, పవన్ కల్యాణ్ కు ఎంతో వ్యత్యాసం ఉందని పేర్ని నాని అన్నారు. చిరంజీవి దేవుడని నాని కొనియాడారు. ఆయన ప్రజల కోసం పార్టీ ఏర్పాటు చేశారని, ఓ దశలో ప్రజాదరణ లేని కారణంగా పార్టీ నడపలేనని భావించి అదే విషయం అందరితో చెప్పారని వెల్లడించారు. తనకు ఇంతవరకు చాలని అనుకున్నారని, రాజకీయాలకు సరిపడనని గుర్తించి తప్పుకున్నారని వివరించారు. కానీ, చిరంజీవితో పోల్చితే పవన్ కల్యాణ్ భిన్నమైన వ్యక్తి అని పేర్ని నాని పేర్కొన్నారు. పవన్ ఆలోచనలు, దృక్పథం వేరేగా ఉంటాయని, చిరంజీవితో ఏమాత్రం సంబంధం లేదని అన్నారు.
Perni Nani
Pawan Kalyan
Chiranjeevi
Chandrababu

More Telugu News