Hyderabad: అప్పుల బాధతో సతమతం.. హైదరాబాద్ మెట్రో రైలు డ్రైవర్ ఆత్మహత్య

Hyderabad Metro Rail Driver Committed Suicide
  • హైదరాబాద్ మెట్రో రైలు డ్రైవర్‌గా పనిచేస్తున్న సందీప్‌రాజ్
  • కొండలా పేరుకుపోయిన అప్పులు
  • శనివారం ఆత్మహత్య చేసుకుంటున్నట్టు స్నేహితుడికి వాట్సాప్ మెసేజ్
అప్పుల బాధకు తాళలేక హైదరాబాద్ మెట్రో రైలు డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని గోల్నాకలో నివసించే తుంకి సందీప్‌రాజ్ (25) నాగోలులో మెట్రో రైలు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు కొండలా పేరుకుపోవడంతో తీర్చే దారి కనిపించలేదు. దీంతో మనోవేదనకు గురైన సందీప్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

శనివారం సాయంత్రం తల్లికి ఫోన్ చేసి తాను ఈ రోజు రాత్రి మియాపూర్ డిపోలోనే ఉండిపోతానని చెప్పాడు. అయితే, ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నం చెరువులో సందీప్‌రాజ్ మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. కుమారుడు ఇక లేడన్న విషయం తెలిసి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కాగా, తాను శనివారం ఆత్మహత్య చేసుకుంటున్నట్టు స్నేహితుడు వెంకటేష్‌కు సందీప్ చేసిన వాట్సాప్ మెసేజ్‌ను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Metro Rail
Metro Rail Driver

More Telugu News