Andhra Pradesh: న్యాయం అడిగితే చెయ్యెత్తి కొట్టబోయారు.. వాసిరెడ్డి పద్మపై బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు

Bonda Uma Says Vasireddy Padma Tries To Beat

  • చంద్రబాబుకు, తనకు నోటీసులివ్వడంపై ఉమ ఆగ్రహం
  • న్యాయం అడిగితే రివర్స్ లో నోటీసులిస్తారా? అని ప్రశ్న
  • ఆమె వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక దివ్యాంగురాలిపై అత్యాచార ఘటన కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న బోండా ఉమతో కలిసి ఆసుపత్రిలో ఉన్న బాధితురాలిని పరామర్శించారు. 

ఈ క్రమంలో, అంతకుముందే వాసిరెడ్డి పద్మ కూడా అక్కడకు చేరుకున్నారు. చంద్రబాబు, పద్మ మధ్య  మాటల యుద్ధం జరిగిన విషయం విదితమే. అయితే, ఘటనపై విచారణ నిమిత్తం వెళ్లిన తనను చంద్రబాబు సహా టీడీపీ నేతలు అడ్డగించారని ఆమె ఆరోపించారు. దీంతో ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఆఫీసులో విచారణకు రావాల్సిందిగా చంద్రబాబు, బోండా ఉమకు మహిళా కమిషన్ నోటీసులిచ్చింది.

దీనిపైనే ఇవాళ బోండా ఉమ స్పందించారు. అత్యాచార బాధితురాలికి 30 గంటల పాటు ప్రభుత్వాసుపత్రిలో నరకం చూపించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పరామర్శకు వెళుతున్నారని తెలిశాకే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడిందన్నారు. తాము వచ్చినప్పుడే వాసిరెడ్డి పద్మ వచ్చారని, బాధితురాలికి న్యాయం చేయాలని కోరినంత మాత్రాన బెదిరిస్తారా? అని నిలదీశారు. 

మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ఆసుపత్రిలో దారుణం జరిగితే సిబ్బంది బాధ్యత తీసుకోరా? అని నిలదీశారు. ఘటనపై న్యాయం చేయాలంటూ తాము కోరితే రివర్స్ లో నోటీసులు పంపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ విధులను వాసిరెడ్డి పద్మ దుర్వినియోగపరుస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు. 

మహిళల మానాలకు వైసీపీ ప్రభుత్వం వెల కడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వలంటీర్లను వేధింపులకు గురి చేస్తున్న వైసీపీ వలంటీర్లకు సమన్లు ఇవ్వకుండా.. తమకు మాత్రమే ఎందుకిస్తున్నారని ఆయన నిలదీశారు. వాసిరెడ్డి పద్మ వ్యవహారంపై తాము హైకోర్టుకు వెళతామని, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Andhra Pradesh
Telugudesam
Bonda Uma
Vasireddy Padma
  • Loading...

More Telugu News