Vijayashanti: గురుకులాల్లో చదివే విద్యార్థులు బయటకు చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నారు: విజయశాంతి
- చాలాచోట్ల భద్రత గాలిలో దీపం అన్నట్లుందన్న విజయశాంతి
- అపరిశుభ్ర వాతావరణం, కనీస జాగ్రత్తలు కొరవడ్డాయని విమర్శ
- పాములు, ఎలుకల కాట్లకు గురవుతున్నారని వ్యాఖ్య
- కాలకృత్యాలు తీర్చుకునేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆగ్రహం
గురుకులాల్లో విద్యార్థులు పడుతోన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు గుప్పించారు. ''మన దేశ భవిష్యత్తు అయిన మన విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ ఆటలాడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండు. ముఖ్యంగా గురుకులాల్లో చదివే విద్యార్థులు బయటకు చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నారు.
మంచి విద్య, ఆహారం, వసతి... ఇవీ గురుకులాల్లో విద్యార్థులకు అందించాల్సినవి. చదువు పరిస్థితి ఎలా ఉన్నా... చాలాచోట్ల భద్రత గాలిలో దీపం అన్నట్లుంది. అపరిశుభ్ర వాతావరణం, కనీస జాగ్రత్తలు కొరవడడంతో రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లోని విద్యార్థులు పాములు, ఎలుకల కాట్లకు గురవుతున్నారు.
చదువుకుందామని వస్తే ప్రాణాలే పోతున్నాయి. అయినా ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. వంట గది శుభ్రతను విస్మరిస్తుండడం, కుళ్లిన ఆహార పదార్థాలు కూరగాయలను వంటకు ఉపయోగిస్తుండడంతో తరచూ ఎక్కడో ఒకచోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు.
మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటారని తల్లిదండ్రులు పిల్లలను గురుకులాల్లో చేర్పిస్తుంటే అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. నల్లగొండ జిల్లా దామరచర్లలోని గురుకులంలో కలుషితాహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన మరవకముందే, మరో ఆరుగురిని ఎలుకలు కొరికిన విషయం బయటపడింది.
పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధన ఉన్నా చాలా గురుకులాల్లో ఇది మచ్చుకైనా కనిపించని పరిస్థితి కనిపిస్తోంది. కొన్నిచోట్ల సరైన వసతి సదుపాయాలు లేకపోవడంతో పాఠాలు విన్న గదిలోనే విద్యార్థులు రాత్రి నిద్రించాల్సిన దుస్థితి నెలకొంది. సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానం చేసేందుకు విద్యార్థులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే... విద్యార్థుల తినే ఆహారంలో తక్కువ ధరకు లభించే, నాసిరకం పప్పు దినుసులు, కూరగాయలు, ఇతర పదార్థాలు వాడుతున్నారు.
ఉన్నతాధికారుల నిరంతర తనిఖీలు లేకపోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నరు. విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న ఈ కేసీఆర్ సర్కార్‌కు కాలం దగ్గర పడింది'' అని విజయశాంతి విమర్శించారు.