Congress: కొట్టుకున్న కాంగ్రెస్ విద్యార్థి సంఘం నేతలు
- రెండేళ్లుగా జరగని ఎగ్జిక్యూటివ్ సమావేశం
- బల్మూరి వెంకట్‌ను నిలదీసిన చందనారెడ్డి
- ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం
- ఆపై పరస్పరం దాడులు చేసుకున్న ఇరు వర్గాలు
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ)కు సంబంధించిన తెలంగాణ విభాగం ఎగ్జిక్యూటివ్ సమావేశం రసాభాసగా ముగిసింది. ఎస్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బల్మూరి వెంకట్, ఉపాధ్యక్షురాలిగా ఉన్న చందనారెడ్డిల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం కాస్తా ఇరువర్గాల మధ్య కొట్లాటకు దారి తీసింది. ఇరు వర్గాలు కుర్చీలు, బల్లలు ఎత్తుకుని మరీ పరస్పరం దాడులు చేసుకున్నారు.
రెండేళ్లుగా ఎన్ఎస్‌యూఐ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగలేదు. ఈ క్రమంలో బుధవారం గాంధీ భవన్ ఆవరణలోని ఇందిరా భవన్ లో మొదలైన సంఘం ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఇదే విషయాన్ని చందనారెడ్డి ప్రస్తావించారు. చందనారెడ్డి ప్రశ్నతోనే సమావేశంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఆపై మరింత రెచ్చిపోయిన ఇరు వర్గాలు కుర్చీలు, బల్లలు విసురుకుంటూ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీంతో ప్రశాంతంగా సాగాల్సిన సమావేశం రసాభాసగా ముగిసింది.