Kishan Reddy: రైతులను ఆదుకోవాలని కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా కేసీఆర్ సర్కారు మొండికేసింది: కిషన్ రెడ్డి
- ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రం, తెలంగాణ మధ్య వార్
- ధాన్యం సేకరణపై కేసీఆర్ సర్కారుది నిర్లక్ష్య వైఖరన్న కిషన్ రెడ్డి
- ఆరుసార్లు గడువు పొడిగించామని వెల్లడి
ధాన్యం కొనుగోలు అంశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రం మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ సర్కారుపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటమాడిందని అన్నారు.
ధాన్యం కొనుగోలు అంశంలో రైతులు నష్టపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కేంద్రం ఎన్నోసార్లు కోరిందని వెల్లడించారు. ధాన్యం సేకరణపై ఆరుసార్లు గడువు పెంచినా రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. 2021-22 సీజన్ లో ఖరీఫ్, యాసంగి ధాన్యాన్ని సకాలంలో ఎఫ్ సీఐకి ఇవ్వలేకపోయిందని తెలిపారు.
రైతుల క్షేమం కోసం స్పందించాలని కోరినా, కేసీఆర్ సర్కారు మొండికేసిందని, ధాన్యం సేకరణపై కాలయాపన చేసిందని మండిపడ్డారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇస్తామని చెప్పారని, మరి ఇస్తారో లేదో తెలియడంలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విపరీతమైన గోనె సంచుల కొరత ఉందని, తూకం వేసే కాంటాలు లేవని, ధాన్యంలో తేమ శాతం కొలిచే యంత్రాలు లేవని ఆరోపించారు. ధాన్యంపై కప్పేందుకు ఒక మార్కెట్ యార్డులోనూ టార్పాలిన్ పట్టలు లేవని విమర్శించారు.