Andhra Pradesh: అవినీతిపై ఫిర్యాదులకూ ప్రత్యేక యాప్... ఏపీ సీఎం జగన్ ఆదేశం
![ap cm jagan orders special app for acb complaints](https://imgd.ap7am.com/thumbnail/cr-20220420tn625fd2eb74557.jpg)
- దిశ యాప్ తరహాలోనే ఏసీబీ కేసులకు యాప్
- నెల రోజుల్లోగా రూపొందించాలని జగన్ ఆదేశం
- ఈ యాప్‌కు ఆడియో ద్వారానూ ఫిర్యాదు చేసే అవకాశం
మహిళలపై నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏపీ ప్రభుత్వం దిశ పేరిట ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు అవినీతికి సంబంధించిన ఫిర్యాదుల కోసం కూడా దిశ యాప్ తరహాలోనే కొత్తగా ఓ యాప్ ఏపీలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు హోం శాఖపై బుధవారం నాడు సమీక్షించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అవినీతి కేసులకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఓ యాప్‌ను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నెల రోజుల్లోగా అందుబాటులోకి రానున్న ఈ యాప్‌కు ఆడియో క్లిప్‌ను పంపి కూడా అవినీతిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అవినీతి కేసుల నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల వరకే ఉన్న ఏసీబీ స్టేషన్లను ఇకపై మండల స్థాయి వరకు తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు జగన్ పేర్కొన్నారు.