Sanjay Dutt: కేన్సర్ అని తెలియడంతో కొన్ని గంటల పాటు ఏడ్చేశా: సంజయ్ దత్
- నేను, నా కుటుంబ భవిష్యత్తు ఏంటో అర్థం కాలేదు
- నాకు నేనే ధైర్యాన్ని చెప్పుకున్నా
- డాక్టర్ ఏమీ కాదన్న భరోసా ఇచ్చారు
- కేన్సర్ పై విజయం అనుభవాలను పంచుకున్న నటుడు
తనకు కేన్సర్ మహమ్మారి సోకిందని తెలియగానే.. కొన్ని గంటలపాటు ఏడ్చినట్టు బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ తెలిపారు. కరోనా లాక్ డౌన్ సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సంజయ్ దత్ పంచుకున్నారు.
‘‘కేన్సర్ అని నాకు చెప్పిన వెంటనే ఏడుపు ఆగలేదు. నా కుటుంబం, నా జీవితం ఏమైపోతుందా అన్న భయం ఏర్పడింది’’ అని చెప్పాడు. తాను కేన్సర్ పై ఎలా పోరాడింది? ఆయన వివరించారు. కీమో థెరపీతో ఎన్నో దుష్ప్రభావాలు ఎదురవుతాయన్న డాక్టర్ హెచ్చరికలను.. అయినా ఏమీ కాదంటూ భరోసా ఇవ్వడాన్ని గుర్తు చేసుకున్నారు.
2020 ఆగస్ట్ లో సంజయ్ కు లంగ్ కేన్సర్ ఉన్నట్టు పరీక్షల్లో బయటపడింది. ‘‘ఒక రోజు మెట్లు ఎక్కుతుంటే శ్వాస ఆడ లేదు. స్నానం చేస్తున్నా అంతే. దాంతో డాక్టర్ కు కాల్ చేశాను. ఎక్స్ రేలో ఊపిరితిత్తుల్లో సగం మేర నీరు చేరినట్టు గుర్తించారు. దాన్ని టీబీ అనుకున్నారు. కానీ, అది కేన్సర్ అని తేలింది’’అని సంజయ్ వెల్లడించారు.
విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకోవాలని సంజయ్ అనుకున్నారట. ముందు వీసా లభించలేదు. భారత్ లోనే చికిత్స తీసుకోవాలన్న సలహా వచ్చింది. తర్వాత నటుడు, నిర్మాత రాకేష్ రోషన్ ఓ డాక్టర్ ను సంజయ్ కు సూచించారు. దుబాయిలో కీమో థెరపీ తీసుకునే సమయంలో రోజూ బ్యాడ్మింటన్ రెండు మూడు గంటల పాడు ఆడాను. కూర్చుని సైకిల్ తొక్కడం చేసాను. మొత్తానికి కేన్సర్ ను సంకల్ప బలంతో, మనో ధైర్యంతో జయించినట్టు సంజయ్ చెప్పారు.