Rape: 48 మంది రోగులపై లైంగిక నేరాలు.. స్కాట్లాండ్ లో భారత సంతతి వైద్యుడి నిర్వాకం!

Indian Origin Doctor Convicted In Raping 48 Women Patients

  • టెస్టుల పేరుతో అఘాయిత్యాలు
  • దోషిగా ప్రకటించిన గ్లాస్గో హైకోర్ట్
  • కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన డాక్టర్
  • భారత చదువుల్లో అలాగే చెప్పారంటూ చెప్పిన వైనం

అతడు పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్నాడు. అయితే, వ్యాధి నయం చేయించుకునేందుకు వచ్చే పేషెంట్ల పాలిట నయవంచకుడిగా మారాడు. 1983 నుంచి 2018 దాకా 48 మందిపై లైంగిక నేరాలకు ఒడిగట్టాడు. రోగులను ముద్దుపెట్టుకోవడం, శరీర భాగాలను తడమడం, అనవసరమైన చోట పరీక్షలు చేయడం, అసభ్యకరంగా మాట్లాడడం.. వంటి పలు నేరాలకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన స్కాట్లాండ్ లో జరిగింది. ఇంతటి నిర్వాకానికి పాల్పడింది భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. 

2018లో ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో కృష్ణా సింగ్ (72) అనే వ్యక్తిని స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ శాఖ డిటెక్టివ్స్ కేసును దర్యాప్తు చేశారు. అనంతరం అతడిని గ్లాస్గో హైకోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడిని దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. 

అయితే, అతడు మాత్రం తాను చేసిన తప్పు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నెపాన్ని భారత విద్యావ్యవస్థ మీదకు నెట్టే ప్రయత్నం చేశాడు. ‘‘మహిళలు ఆరోపిస్తున్నదంతా అబద్ధం. కొన్ని పరీక్షలు మాకు భారత వైద్య శిక్షణలో భాగం. అదే మేం చదువుకున్నప్పుడు చెప్పారు’’ అని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించాడు. 

కాగా, కృష్ణా సింగ్ కు అక్కడ సొసైటీలో మంచి గౌరవం ఉంది. ఆయన వైద్య సేవలకుగానూ రాయల్ మెంబర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ (ఎంబీఈ) పురస్కారాన్నీ అందుకున్నాడు. అయితే, ఇప్పుడు మొత్తంగా 54 కేసుల్లో అతడిని కోర్టు దోషిగా ప్రకటించింది. వచ్చే నెలలో శిక్ష విధిస్తామని, అప్పటిదాకా బెయిల్ పై కృష్ణా సింగ్ ను విడుదల చేయాలని జడ్జి ఆదేశించారు.

More Telugu News