Andhra Pradesh: పోరస్ కంపెనీకి తాళం.. ప్రకటించిన ఏలూరు కలెక్టర్

Eluru Collector Locks Porus Chemical Factory

  • విచారణ పూర్తయ్యే వరకు మూత
  • నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే సీజ్
  • చికిత్స పొందుతున్న బాధితులకు కంపెనీనే వేతనం ఇస్తుందని వెల్లడి

అగ్ని ప్రమాదం జరిగిన పోరస్ కెమికల్ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ప్రకటించారు. నిన్న రాత్రి ఏలూరు జిల్లాలోని అక్కిరెడ్డి గూడెంలో ఉన్న రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించి ఆరుగురు చనిపోగా.. 13 మంది గాయపడిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో కంపెనీ ఘటనపై కలెక్టర్ స్పందించారు. నిర్వహణ విషయంలో సంస్థ నిబంధలను ఉల్లంఘించిందా? లేదా? అనే విషయంపై విచారణ చేస్తామన్నారు. ప్రమాదకర రసాయనాలను వాడారా? అనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. పీడనం ఎక్కువవడం వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి పేలుడు సంభవించిందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. అప్పటి వరకు పరిశ్రమకు తాళం వేస్తామన్నారు. ఉల్లంఘించినట్టు తేలితే కంపెనీని పూర్తిగా సీజ్ చేస్తామని ప్రకటించారు. 

కాగా, బాధితులకు చికిత్స సమయంలో సంస్థే వేతనం చెల్లిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. మరోపక్క, ఘటన జరిగిన పరిశ్రమను స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ పరిశీలించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు, సంస్థ తరఫున మరో రూ.25 లక్షల పరిహారం అందుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News