Delhi: ఢిల్లీకి సమీపంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. విద్యార్థులపై ప్రభావం!
- నోయిడాలో కొత్తగా 53 కేసులు
- ఒక స్కూల్లోని 13 మంది విద్యార్థులకు కరోనా
- నోయిడా, ఘజియాబాద్ లో పలు స్కూళ్లకు సెలవులు
దేశంలో కరోనా వైరస్ మళ్లీ ప్రభావం చూపుతోంది. ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ సృష్టించిన కరోనా ... ఇప్పుడు మరోసారి క్రమంగా వ్యాప్తి చెందుతోంది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న నోయిడాలో కేసులు అమాంతం పెరిగాయి. గత 48 గంటల్లో నోయిడాలో కొత్తగా 53 కేసులు వెలుగుచూశాయి. అయితే వీటిలో ఎక్కువ కేసులు పాఠశాలల్లో వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.
నోయిడా సెక్టార్ 40లోని ప్రైవేట్ స్కూల్లో 13 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఘజియాబాద్ లోని స్కూల్లో 13 ఏళ్ల విద్యార్థికి కరోనా సోకింది. దీంతో నోయిడా, ఘజియాబాద్ లలో పలు ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించి, ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ లోని ఎల్452 మ్యుటేషన్ కేసులు ఇప్పుడు భారత్ లో నమోదవుతున్నాయి.