BJP: సజ్జల కేంద్రంగా ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జీవీఎల్ ఘాటు వ్యాఖ్యలు
- మంత్రుల తొలగింపునకు కారణాలేంటి?
- అసమర్థతా? లేదంటే అవినీతా?
- సజ్జల వ్యవహారంపై సీఎం సమాధానం చెప్పాలన్న జీవీఎల్
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై బీజేపీ కీలక నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా మాజీ మంత్రుల అలకలు చూస్తుంటే.. వైసీపీలోని విభేదాలు బయటపడుతున్నాయంటూ వ్యాఖ్యానించిన జీవీఎల్.. ఈ మొత్తం వ్యవహారం వెనుక వైసీపీ కీలక నేత, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందన్న కోణంలో వ్యాఖ్యలు చేశారు. సలహాదారుడే మంత్రులను తొలిగించారన్న జీవీఎల్.. సలహాదారుడికి ఆ అధికారం ఎక్కడిదని కూడా ప్రశ్నించారు.
"వైసీపీలో విభేదాలు బయటపడుతున్నాయి. తాజా మాజీలందరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. మంత్రులను ఎందుకు తొలగించారో సీఎం చెప్పాలి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కారణాలేంటి? మంత్రుల అవినీతా? అసమర్థతా? ప్రజలకు సీఎం జగన్ చెప్పాలి. సలహాదారుడికి మంత్రులను తొలగించే అధికారం ఎక్కడిది? సజ్జల వ్యవహారంపై సీఎం సమాధానం చెప్పాలి. మంత్రుల అలకలు చూస్తుంటే.. జగన్ మరో 15 రోజుల పాటు ఓదార్పు యాత్ర చేయాలి. లేదంటే మమ్మల్ని ఓదార్పు యాత్రలు చేయమంటారా?" అంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు.