Jagan: కడుపు మంట ఎక్కువైతే గుండెపోటుతో టికెట్ తీసుకుంటారు: ప్రత్యర్థులపై జగన్ విసుర్లు

Nobody can defeat me says Jagan

  • చిక్కీ కవర్ పై జగన్ ఫొటో ఉందని ఎల్లో మీడియా రాస్తోందన్న సీఎం  
  • ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ 
  • పార్లమెంటును కూడా కుట్రలకు వాడుకుంటున్నారన్న జగన్ 

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నంద్యాలలో 'వసతి దీవెన' కార్యక్రమం సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేస్తానని ఇక్కడే చెప్పానని... చెప్పిన విధంగానే జిల్లాలను చేసి ఇక్కడకు వచ్చానని అన్నారు. దేవుని దయ, ప్రజల అభిమానం ఉన్నంత వరకు తన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరని చెప్పారు. 

స్కూలు పిల్లలకు ఇస్తున్న చిక్కీ కవర్ పై జగన్ ఫొటో ఉందని ఎల్లో మీడియా రాస్తోందని... కడుపు మంట, అసూయకు మందు లేదని... ఇవి రెండూ ఎక్కువైతే గుండెపోటు వచ్చి టికెట్ తీసుకుంటారని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇవ్వకుండా పెండింగ్ పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు కూడా తామే ఇస్తున్నామని అన్నారు. జగనన్న ఉన్నాడనే నమ్మకంతో పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తున్నారని... ఇవన్నీ చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి, ఎల్లో మీడియాకు కనిపించవని ఎద్దేవా చేశారు.

రోజుకో కట్టు కథ చెప్పి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు యత్నిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఈ కుట్రకు పార్లమెంటును సైతం వాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి ప్రతిపక్షం ఉండటం దురదృష్టకరమని అన్నారు. నాడు - నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నామని జగన్ చెప్పారు. స్కూలుకు పంపితే చాలు.. అమ్మఒడి డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. అక్కచెల్లెమ్మల కోసం వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, సున్నా వడ్డీ రుణాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని... నంద్యాలకు కూడా మెడికల్ కాలేజీ వస్తుందని తెలిపారు. 

జగనన్న వసతి దీవెన కింద రూ. 1,024 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నామని చెప్పారు. ఇంట్లో ఎంత మంది చదివితే అంతమందికి ఇస్తామని అన్నారు. జగనన్న ఉన్నాడనే ధైర్యంతో ఉండాలని, అన్నీ తానే చూసుకుంటానని భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News