Supreme Court: రాష్ట్ర విభజనపై ఉండవల్లి సవరణ పిటిషన్... త్వరితగతిన విచారించేందుకు సుప్రీం అంగీకారం
- 2014లో రాష్ట్ర విభజన
- సుప్రీంకోర్టులో ఉండవల్లి పిటిషన్
- పూర్తయిన విభజన ప్రక్రియ
- పిటిషన్ కు సవరణలు చేసిన ఉండవల్లి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014లో విభజనకు గురైన సంగతి తెలిసిందే. అయితే, ఏపీ పునర్విభజనలో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయంటూ నాడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, విభజన ప్రక్రియ పూర్తికావడంతో, తాజాగా దానికి సవరణ పిటిషన్ దాఖలు చేశారు. భవిష్యత్ లోనైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తగిన నియమ నిబంధనలు రూపొందించేలా కేంద్రాన్ని నిర్దేశించాలని ఉండవల్లి ఆ పిటిషన్ లో కోరారు. ఈ నేపథ్యంలో, పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది.
న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ, ఈ పిటిషన్ వేసి చాన్నాళ్లు అయిందని సీజేఐ ధర్మాసనానికి విన్నవించారు. దాంతో, ధర్మాసనం స్పందిస్తూ, ఉండవల్లి సవరణ పిటిషన్ ను వేగంగా విచారణ జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. వచ్చేవారం విచారించాల్సిన కేసుల జాబితాలో ఈ సవరణ పిటిషన్ ను కూడా చేర్చాలంటూ సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చింది.