Hyderabad: ఉస్మానియా ఆసుపత్రి భవనం పై నుంచి దూకి రోగి ఆత్మహత్య... కారణం ఏమింటంటే..!
- ఈ నెల 2న పురుగుల మందు తాగిన నాగరాజు
- ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైనం
- ఆసుపత్రికి మద్యం తీసుకురావాలని భార్యను కోరిన నాగరాజు
- భార్య వారించడంతో ఆత్మహత్య
హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిలో విషాదకర ఘటన సంభవించింది. తనను ఆసుపత్రిలో మద్యం తాగొద్దన్నారనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ రోగి... ఆసుపత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన నాగరాజు (22) అని అఫ్జల్ గంజ్ సీఐ రవీందర్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 2వ తేదీన నాగరాజు పురుగుల మందు తాగాడు. చికిత్స కొసం నాగరాజును భార్య సంతోష ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో, ఆసుపత్రిలోని కులీ కుతుబ్ షా భవనం నాలుగో అంతస్తులోని ఎంఎం2 వార్డులో నాగరాజు చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలోకి మద్యం తీసుకురావాలని భార్యను వేధించేవాడు.
అయితే, మద్యం తాగొద్దని భార్య వారించడంతో, ఆమెను తోసేసి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత భవనం నాలుగో అంతస్తు కిటికీ అద్దాలను పగులగొట్టి, అక్కడి నుంచి కిందకు దూకాడు. ఈ ఘటనలో అతని తలకు బలమైన గాయం అయి, అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, గత నాలుగు రోజులుగా అతను మద్యం లేకపోవడంతో మానసికంగా కుంగిపోయాడని చెప్పారు.