Kannababu: టీడీపీ రోడ్ మ్యాప్‌లో జనసేనాని... పవన్‌పై మంత్రి కన్నబాబు సెటైర్లు
![minister kannababu comments on pawan kalyan](https://imgd.ap7am.com/thumbnail/cr-20220406tn624db0f762d58.jpg)
- 12 లక్షల మంది కౌలు రైతులకు కార్డులు
- కౌలు రైతులకు పీఎం కిసాన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారా?
- పవన్‌ది ఆవేశపూరిత రాజకీయమన్న కన్నబాబు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ కీలక నేత, మంత్రి కురసాల కన్నబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్.. బీజేపీ రోడ్ మ్యాప్‌తో కాకుండా టీడీపీ రోడ్ మ్యాప్‌లో పయనిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలపై పవన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించిన కన్నబాబు.. తమ పెట్టుబడి సాయం పథకమే రైతు భరోసా అని తెలిపారు.
విత్తనం నుంచి విక్రయం వరకూ తమ ప్రభుత్వం రైతు వెన్నంటే ఉందన్న కన్నబాబు.. మీరు భరోసా ఇచ్చేదేంటని పవన్‌ను ప్రశ్నించారు. ఇప్పటివరకు 12 లక్షలకు పైగా కౌలు రైతుల కార్డులు ఇచ్చామని, పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు సాయం చేయడం లేదని తెలిపారు. కౌలు రైతులకు పీఎం కిసాన్ ఇవ్వాలని ఏనాడైనా కేంద్రానికి లేఖ రాశారా? అని కూడా ఆయన పవన్‌ను ప్రశ్నించారు. పవన్‌ది ఆవేశపూరిత రాజకీయమన్న మంత్రి.. జగన్‌ది అర్థవంతమైన రాజకీయమని వ్యాఖ్యానించారు.