EDCET: తెలంగాణ ఎడ్ సెట్ షెడ్యూల్ ఇదిగో!
- జులై 26, 27 తేదీల్లో ఎడ్ సెట్
- తెలంగాణ, ఏపీలో పరీక్షలు
- ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు
- ఆ తర్వాత ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునే అవకాశం
బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం తెలంగాణ సర్కారు ఎడ్ సెట్ షెడ్యూల్ ప్రకటించింది. జులై 26, 27 తేదీల్లో ఎడ్ సెట్ నిర్వహించనున్నారు. తెలంగాణలోని 220 బీఈడీ కాలేజీల్లోని 19,600 సీట్ల కోసం ఈ ఎడ్ సెట్ జరుపుతున్నారు. 50 శాతం మార్కులతో డిగ్రీ, ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన వారు ఎడ్ సెట్ రాయడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్ కేటగిరీలకు చెందినవారికి 40 శాతం మార్కులుంటే సరిపోతుంది. ఆఖరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే, మెడిసిన్ (ఎంబీబీఎస్), బీఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ వంటి వృత్తి విద్యాకోర్సులు చేసేవారు ఎడ్ సెట్ రాసేందుకు అనర్హులుగా తాజా షెడ్యూల్ లో పేర్కొన్నారు.
కాగా, తెలంగాణతో పాటు ఏపీలోనూ వివిధ ప్రాంతాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎడ్ సెట్ ఆశావహులు ఈ నెల 7 నుంచి జూన్ 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుంను ఎస్సీ, ఎస్టీలకు రూ.450, ఇతర కేటగిరీలకు రూ.650గా నిర్ణయించారు. రూ.250 పెనాల్టీతో జులై 1వ తేదీ వరకు, రూ.500 పెనాల్టీతో జులై 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు తెలంగాణ ఎడ్ సెట్ కన్వీనర్ రామకృష్ణ వివరాలు తెలిపారు.