Perni Nani: చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విరుచుకుపడిన మంత్రి పేర్ని నాని

Perni Nani fires on Chandrababu and Pawan Kalyan
  • ఏపీలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు
  • 26 జిల్లాలతో నేటి నుంచి నవ్యాంధ్ర
  • పెరిగిన జనాభాకు మరిన్ని జిల్లాలు అవసరమన్న నాని
  • చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఏమైందంటూ వ్యాఖ్యలు
ఏపీలో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లపై పేర్ని నాని ధ్వజమెత్తారు. ఎక్కడైనా మంచి చేస్తుంటే ఆ మంచి గురించి మాట్లాడలేనివాళ్లు నోటికి తాళం వేసుకోవడం మంచిదని అన్నారు. 

40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు పరిస్థితి ఏమైంది... కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ ఓ నవ యువకుడ్ని (సీఎం జగన్) ను అభ్యర్థించారు అంటూ ఎద్దేవా చేశారు. 1979 నాటికే 13 జిల్లాలు ఏర్పడినప్పుడు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత జనాభా పెరిగింది, ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలి? ఆ మాత్రం తెలియదా? అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇక, పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఎంత చెబితే అంత... చంద్రబాబు దున్నపోతు ఈనిందంటే, దూడను కట్టేస్తానని చెప్పే రకం పవన్ కల్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ ఇస్తే పవన్ ఎక్కడున్నాడు? ప్రభుత్వాన్ని కలిసి ఏమైనా అభిప్రాయాలను పంచుకున్నాడా? చంద్రబాబు ఆఫీసు నుంచి వచ్చిన దానిపై సంతకం చేయడం తప్ప ఏంచేశాడు? అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు. 

"నాడు అమరావతి రైతుల నుంచి భూములు లాక్కుంటే చంద్రబాబును ఒక్క అడుగు కూడా కదలనివ్వను అన్నాడు. అటు, దివీస్ ల్యాబ్ వద్దకు వెళ్లారు... వాళ్లకైనా న్యాయం చేశారా అంటే అదీ లేదు. ఉద్ధానం ప్రజల బాధ్యత తీసుకుంటామన్నారు... ఆ మాటలు ఏమయ్యాయి?" అంటూ పవన్ ను విమర్శించారు.
Perni Nani
Chandrababu
Pawan Kalyan
CM Jagan

More Telugu News