Somireddy Chandra Mohan Reddy: గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించండి: సీఎం జగన్ కు సోమిరెడ్డి లేఖ
- ఏపీలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ
- 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాల ఏర్పాటు
- తిరుపతి జిల్లాలోకి గూడూరు నియోజకవర్గం
- గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు
- జిల్లాల విభజనను స్వాగతిస్తున్నామన్న సోమిరెడ్డి
- గూడూరు విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి
ఏపీలో జిల్లాల విభజన అనంతరం 26 జిల్లాలు ఏర్పడడం తెలిసిందే. గతంలో ఒక జిల్లాలో ఉన్న ప్రాంతాలు ఇప్పుడు మరో జిల్లాలోకి వెళ్లాయి. నిన్నటిదాకా నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి వెళ్లింది. దీనిపై టీడీపీ సీనియర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు.
పరిపాలనా సౌలభ్యం పేరుతో జిల్లాల పునర్ విభజన చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే, భౌగోళికంగా చిన్నదైన నెల్లూరు జిల్లాను నీటిపారుదల, ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని యథాతథంగా కొనసాగించాలని తాము మొదటి నుంచి కోరుతున్నామని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఆ మేరకు 2020లో టీడీపీ తరుఫున కోరామని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల డ్రాఫ్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇదే అంశాన్ని ప్రణాళిక శాఖ కార్యదర్శికి మెయిల్ ద్వారా విన్నవించామని వివరించారు.
మొదట లోక్ సభ నియోజకవర్గాల ఆధారంగా విభజన అన్నప్పటికీ, భౌగోళిక పరిస్థితులు, ప్రజల సౌకర్యార్థం కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు మినహాయింపు ఇచ్చారని సోమిరెడ్డి ప్రస్తావించారు. నెల్లూరు జిల్లాలో కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తర్వాత కూడా నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.
ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కేంద్రానికి 32 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరుతున్నట్టు సీఎం జగన్ కు వివరించారు. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఇదే కోరుతున్నారని స్పష్టం చేశారు. గూడూరు నియోజకవర్గ ప్రజల తాగు, సాగునీటి అవసరాలకు నెల్లూరు జిల్లా పరిధిలోని సోమశిల, కండలేరు జలాశయాలే ఆధారమని సోమిరెడ్డి వెల్లడించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.