Sri Lanka: శ్రీలంకలో మంత్రుల రాజీనామా నేపథ్యంలో.. ప్రభుత్వంలో చేరాలని ప్రతిపక్షాలను కోరిన దేశాధ్యక్షుడు!
- శ్రీలంకను అల్లకల్లోలం చేస్తున్న ఆర్థిక, ఆహార సంక్షోభం
- ప్రజాగ్రహం కారణంగా మంత్రులందరూ రాజీనామా
- అందరం కలిసి దేశాన్ని కాపాడుకుందామన్న దేశాధ్యక్షుడు
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక, ఆహార సంక్షోభం ఆ దేశాన్ని పతనావస్థకు తీసుకుపోతోంది. ప్రజాగ్రహంతో లంక అట్టుడుకుతోంది. మరోవైపు ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక శ్రీలంక పార్లమెంటులోని కేబినెట్ మంత్రులందరూ నిన్న రాజీనామా చేశారు. ఈ క్రమంలో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంత్రివర్గంలో చేరాలంటూ ప్రతిపక్ష పార్టీలకు దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స లేఖలు రాశారు.
ప్రపంచంలో చోటు చేసుకున్న పరిణామాలు, దేశంలోని అనేక ఆర్థిక కారణాల వల్ల శ్రీలంకలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని లేఖలో గొటబాయ తెలిపారు. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే మనమందరం కలసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. భావి తరాల అభ్యున్నతి, దేశ ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని కోరారు. కేబినెట్ లో చేరి, మంత్రి పదవులు స్వీకరించాలని అన్నారు.
మరోవైపు, శ్రీలంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ నివర్ద్ కాబ్రాల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రులందరూ రాజీనామా చేసిన నేపథ్యంలో, తాను కూడా తప్పుకుంటున్నానని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.