Ravindra Jadeja: విజయం కోసం ఏం చేయాలో ఆలోచిస్తున్నాం: రవీంద్ర జడేజా
- పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోయాం
- కష్టపడి మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం
- గైక్వాడ్ పై నమ్మకం ఉందన్న సీఎస్కే కెప్టెన్
ఐపీఎల్ లో వరుసగా మూడు ఓటములతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అవమాన భారంతో కుదేలవుతోంది. ఐపీఎల్ చరిత్రలో నాలుగు టైటిళ్లను గెలిచి, ముంబై ఇండియన్స్ తర్వాత అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న సీఎస్కే.. ఈ విడత పేలవ పనితీరు చూపిస్తోంది. 2020 సీజన్ లో లీగ్ దశ నుంచే నిష్క్రమించడం ఈ జట్టుకు మొదటిసారి. కానీ, మరోసారి లీగ్ దశ నుంచే వెళ్లిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కేకేఆర్ తో తొలి మ్యాచ్ లో, లక్నో సూపర్ జెయింట్స్ తో రెండో మ్యాచ్ లో, పంజాబ్ కింగ్స్ తో మూడో మ్యాచ్ లో సీఎస్కే ఓటమి ఎదుర్కొన్నది. దీనిపై జట్టు కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా స్పందించాడు. ‘‘పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు నష్టపోయాం. బాల్ నుంచి కూడా మంచి మూమెంటమ్ కనిపించలేదు. తిరిగి బలంగా ఎలా రావాలన్నది ఆలోచించాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు.
రుతురాజ్ గైక్వాడ్ ప్రదర్శన పట్ల ఆందోళన చెందుతున్నారా? అన్న ప్రశ్నకు.. ‘‘లేదు. అతడిలో నమ్మకాన్ని కల్పించాల్సి ఉంది. అతడు మంచి ఆటగాడన్న విషయం తెలిసిందే. తిరిగి మంచి ఫామ్ తో వస్తాడన్న నమ్మకం ఉంది’’ అని జడేజా తెలిపాడు. ఈ సందర్భంగా దూబే ప్రదర్శనను కూడ మెచ్చుకున్నాడు. ‘‘దూబే చక్కగా బ్యాటింగ్ చేశాడు. కష్టపడి, బలంగా అవతరించేందుకు మా వంతు ప్రయత్నిస్తాం’’ అని జడేజా చెప్పాడు.
2021 సీజన్ లో సీఎస్కే టైటిల్ గెలవడంలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాప్ డూప్లెసిస్ కీలకంగా వ్యవహరించారు. బౌలర్లలో దీపక్ చాహర్ పాత్ర ముఖ్యం. ఈ విడత డూప్లెసిస్ ను సీఎస్కే వేలంలో కొనుగోలు చేయలేదు. గైక్వాడ్ ఒక్క మ్యాచ్ లోనూ కుదురుకోవడం లేదు. చాహర్ గాయం కారణంగా దూరమయ్యాడు. ధోనీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో ఆ బాధ్యతలను జడేజాకు అప్పగించాడు.