Nellore District: నెల్లూరులో యాపిల్ ధరలతో పోటీపడుతున్న నిమ్మకాయలు!
- గూడూరు మార్కెట్‌లో కిలో రూ. 160
- గతేడాదితో పోలిస్తే రెట్టింపు ధర
- రెండో రకం కాయలకు రూ. 130-150 మధ్య ధర
వేసవి ఎండలు మండిపోతుండడంతో నిమ్మకాయలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో వాటి ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. నెల్లూరు జిల్లా గూడూరు మార్కెట్‌లో నిన్న నిమ్మకాయలకు రికార్డు ధర పలికింది. మార్కెట్‌కు ఓ రైతు తెచ్చిన మొదటిరకం (ఆకుపచ్చ) నిమ్మకాయలను వ్యాపారులు కిలో రూ. 160 చొప్పున కొనుగోలు చేశారు.
రెండో రకం కాయలు రూ. 130-150 మధ్య పలుకుతుండగా, నిమ్మ పండ్లు రూ. 100-130 మధ్య ధర పలుకుతున్నాయి. గతేడాదితో పోలిస్తే వీటికి ఇప్పుడు రెట్టింపు ధర పలుకుతున్నట్టు రైతులు చెబుతున్నారు. ఇక, జిల్లాలో కిలో యాపిల్ పండ్లను రూ. 150-200 మధ్య విక్రయిస్తుండడం గమనార్హం.