Sajjala Ramakrishna Reddy: ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు కాబట్టే సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారు: సజ్జల
- అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకి అన్న సజ్జల
- డెడ్ లైన్ విధించి అభివృద్ధి చేయమంటే ఎలా అని ప్రశ్న
- లక్ష కోట్లతో రాజధాని నిర్మించడం అవసరమా? అంటూ వ్యాఖ్య
గత నెలలో అమరావతిపై తీర్పునిచ్చిన హైకోర్టు... ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించడం తెలిసిందే. ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు కాబట్టే సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకి అని వెల్లడించారు. నిధులు లేని పరిస్థితుల్లో డెడ్ లైన్ విధించి అభివృద్ధి చేయమంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
ఎకరాకు రూ.2 కోట్లు అవసరం అవుతుందని సీఎం జగన్ గణాంకాలతో సహా అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని సజ్జల ప్రస్తావించారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించడం అవసరమా? అని అన్నారు. కేవలం ఒక ప్రాంతం కోసమే లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. నిధులు సమృద్ధిగా ఉంటే సింగపూర్ కాకపోతే దాని తాతను రాజధానిగా నిర్మించవచ్చని సజ్జల వ్యాఖ్యానించారు.