Vladimir Putin: పుతిన్ తో పాటు ఎప్పుడూ కొందరు డాక్టర్లు ఉంటారు... ఎందుకో వెల్లడించిన 'ప్రాజెక్ట్ మీడియా '!

Putin health on radar in the wake of invasion

  • పుతిన్ ఆరోగ్యంపై కథనాలు
  • థైరాయిడ్ క్యాన్సర్ అంటూ సందేహాలు
  • మీడియా ప్రాజెక్ట్ సంస్థ పరిశోధనాత్మక కథనం
  • పుతిన్ కు మానసిక సమస్యలు ఉన్నాయన్న జపాన్ సంస్థ

ఉక్రెయిన్ పై దాడుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. పుతిన్ వ్యక్తిగత విషయాల గురించి, సంతానం, ప్రేమాయణం... ఇలా అనేక అంశాలు మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా, పుతిన్ ఆరోగ్య పరిస్థితిపై 'ప్రాజెక్ట్ మీడియా' (రష్యన్ భాషలో ప్రొయెక్ట్ మీడియా) అనే సంస్థ సంచలన కథనం వెలువరించింది. పుతిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు సందేహాలు ఉన్నాయని పేర్కొంది. 

పుతిన్ వెంట ఎప్పుడూ ఉండే బృందంలో కొందరు డాక్టర్లు తప్పనిసరిగా ఉంటారని మీడియా ప్రాజెక్ట్ వెల్లడించింది. వారిలో ఒకరు థైరాయిడ్ క్యాన్సర్ నిపుణుడు కాగా, ఇంకొకరు న్యూరో సర్జన్ అని పేర్కొంది. పుతిన్ స్టెరాయిడ్లు వాడుతున్నందునే ఆయన ముఖం, మెడ ఉబ్బినట్టుగా కనిపిస్తుంటాయని ఆ కథనం చెబుతోంది.  

ముఖ్యంగా పుతిన్ 2020లో నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎండోక్రైనాలజీ చీఫ్ ఇవాన్ దెదోవ్ ను కలిశారని తెలిపింది. థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు, ఈ తరహా క్యాన్సర్ చికిత్సలో వాడే టైరోజిన్ అనే ఔషధం గురించి ఆనాటి సమావేశంలో పుతిన్ కు ఇవాన్ దెదోవ్ వివరించారని ప్రాజెక్ట్ మీడియా వెల్లడించింది. టైరోజిన్ సమర్థత ఏమేరకు ఉంటుందని పుతిన్ అడిగి తెలుసుకున్నారని పేర్కొంది. 

అప్పటినుంచే పుతిన్ ఆరోగ్యం సందేహాస్పదంగా మారిందని, పుతిన్ కరోనా బారినపడిన సమయంలోనూ ఓ థైరాయిడ్ క్యాన్సర్ నిపుణడు పుతిన్ వెంటే ఉండేవారని వివరించింది. అంతేకాదు, పుతిన్ ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే చాలా దూరం నుంచే మాట్లాడుతుంటారని ప్రాజెక్ట్ మీడియా తన కథనంలో పేర్కొంది. ఓ ఐదారు సార్లు పుతిన్ ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదని, తరచుగా ఆయన సోచీలోని ఓ రిసార్టులో దర్శనమిస్తుంటారని, ఆ సమయంలోనూ ఆయన వెంట 5 నుంచి 17 మంది వరకు డాక్టర్లు ఉండేవారని తెలిపింది. 

కాగా, పుతిన్ మాయమైన ప్రతిసారి, ప్రజల్లో అనుమానాలు రాకుండా ఆయన గత వీడియోలను ప్రభుత్వ వర్గాలు ప్రసారం చేసేవని ఆరోపించింది. 

ఇదిలావుంచితే, పుతిన్ మానసిక రోగి అంటూ జపాన్ కు చెందిన రిస్క్ మేనేజ్ మెంట్ టెక్నాలజీస్ సంస్థ ఓ కథనంలో వెల్లడించింది. అయితే వీటిని కొందరు నిపుణులు అంగీకరించడంలేదు. పుతిన్ ఏడు పదుల వయసుకు సమీపంలో ఉన్నారని, సహజంగానే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తుంటాయని వారు అభిప్రాయపడ్డారు. రష్యా ప్రభుత్వ వర్గాలు ఈ కథనాలపై మండిపడుతున్నాయి. పుతిన్ ఆరోగ్యంపై ఇదంతా పాశ్చాత్య దేశాల కుట్ర అని ఆరోపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News