trai: 28 రోజులు కాదు.. ఇకపై నెలవారీ ప్లాన్ తీసుకోవచ్చు
- ప్రతీ నెలా ఒకే తేదీన రీచార్జ్ సదుపాయం
- కనీసం ఒక్కటైనా నెలవారీ ప్లాన్ ఆఫర్ చేయాలి
- టెలికం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు
- రూ.259 ప్లాన్ ను ప్రకటించిన రిలయన్స్ జియో
గతంలో ప్రీపెయిడ్ ప్లాన్లు 30 రోజుల కాల పరిమితితో ఉండేవి. ఆ తర్వాత ఆదాయం పెంచుకునే మార్గాల్లో భాగంగా టెలికం కంపెనీలు 28 రోజులకు కుదించాయి. 24 రోజుల వ్యాలిడిటీతోనూ కొన్ని ప్లాన్లను తెచ్చాయి. ఈ క్రమంలో వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకున్న టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) నెల రోజుల వ్యాలిడిటీతో కనీసం ఒక ప్లాన్ అయినా ఆఫర్ చేయాలని ఇటీవలే ఆదేశించింది. దీనికి సంబంధించి తాజాగా మరింత స్పష్టతనిచ్చింది.
ఒక నెలలో ఏ రోజు అయితే రీచార్జ్ చేసుకుంటారో.. సరిగ్గా వచ్చే నెల అదే తేదీన రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ జనవరి 31న చేసుకున్నారనుకోండి. అప్పుడు ఫిబ్రవరి 28 రీచార్జ్ గడువుగా అమలవుతుంది. నెలలో చివరి రోజు రీచార్జ్ చేసుకున్నందున ప్రతీ నెలా చివరి తేదీయే రెన్యువల్ రీచార్జ్ గడువుగా అమలవుతుంది.
‘‘ప్రతి టెలికం కంపెనీ కనీసం ఒక నెలవారీ ప్లాన్ వోచర్ ను అందించాలి. ఒక స్పెషల్ టారిఫ్ వోచర్, ఒక కాంబో వోచర్ ను ప్రతీ నెలా అదే తేదీన రెన్యువల్ చేసుకునే సదుపాయంతో ఉండాలి. ఏదైనా ఒక నెలలో ఆ తేదీ అందుబాటులో లేకపోతే చివరి తేదీని పరిగణనలోకి తీసుకోవాలి ’’ అని ట్రాయ్ తన తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ట్రాయ్ ఆదేశాలు మే చివరి నాటికి అమల్లోకి రానున్నాయి.
28 రోజులతో ప్లాన్ ఉండడం వల్ల తిరిగి ఎప్పుడు రెన్యునల్ చేసుకోవాలన్నది వినియోగదారులకు గుర్తుండడం లేదు. ఈ అయోమయానికి నెలవారీ ప్లాన్ ముగింపు పలుకుతుందని ట్రాయ్ అభిప్రాయం. ట్రాయ్ ఆదేశాల అనంతరం రిలయన్స్ జియో నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. రూ.259తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రతి రోజు రూ.1.5 జీబీ డేటాతోపాటు అన్ లిమిటెడ్ వాయిస్, రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు అందుబాటులో ఉంటాయి. జియో యాప్స్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.