Russia: క్రూడాయిల్ భలే చవకగా ఇస్తాం.... భారత్ కు రష్యా తాజా ఆఫర్

Russia offers India huge discount on Ural Crude Oil

  • ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం
  • అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలు
  • యుద్ధం ముందున్న ధరకే ఇస్తామంటున్న రష్యా
  • బ్యారెల్ పై 35 డాలర్లు తగ్గిస్తామని ప్రతిపాదన

ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం తెలిసిందే. ఉక్రెయిన్ పై దాడికి దిగిందన్న ఆగ్రహంతో రష్యా వాణిజ్యంపై అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు తీవ్ర ఆర్థిక, వ్యాపారపరమైన ఆంక్షలు విధించాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్ తన మిత్రదేశం రష్యా నుంచి భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే చాలా తక్కువ ధరకు 30 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ ను కొనేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. 

అయితే, ఇంతకంటే ఇంకా చవక ధరకు, అంటే యుద్ధానికి ముందు ఉన్న ధరకే క్రూడాయిల్ ను సరఫరా చేస్తామంటూ రష్యా... భారత్ కు ఆఫర్ ఇచ్చింది. బ్యారెల్ పై 35 డాలర్ల వరకు భారీ రాయితీ ఇస్తామని భారత్ ను ఊరిస్తోంది. అంతర్జాతీయ విపణిలో తమ కరెన్సీ రూబుల్ కుంగిపోతే ఏం జరుగుతుందో రష్యాకు బాగా తెలుసు. అందుకే భారత్ తో వీలైనంత అధికంగా వాణిజ్య ఒప్పందాలకు ప్రయత్నిస్తోంది. 

తాజాగా భారత్ లో పర్యటిస్తున్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ కూడా ముడి చమురు అంశాన్ని ప్రస్తావించే అవకాశాలున్నాయి. దేశంలో పెట్రో ధరలు మండిపోతూ, విపక్షాలు ఎండగడుతున్న తరుణంలో భారత్ కూడా రష్యా ప్రతిపాదనకు మొగ్గు చూపుతుందని వివిధ వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News