KTR: ఇండియన్ సిలికాన్ వ్యాలీలో అసౌకర్యాలపై 'ఖాతాబుక్' సీఈవో ఆవేదన.. తెలంగాణ రావాలంటూ కేటీఆర్ ట్వీట్
- సిలికాన్ వ్యాలీ స్థితిగతులపై రవీశ్ నరేశ్ ట్వీట్
- ఏ ఒక్కటీ బాగా లేవని ఆవేదన
- వెంటనే స్పందించిన కేటీఆర్
- తెలంగాణలోని పరిస్థితులను వివరిస్తూ రిప్లై
భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఏర్పాటైన పరిశ్రమలు ఏ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్న విషయంపై ఖాతాబుక్ సీఈఓ రవీష్ నరేశ్ చేసిన ఆవేదనా భరిత ట్వీట్ కు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ క్విక్ రిప్లై ఇచ్చారు. సిలికాన్ వ్యాలీలో అసౌకర్యంగా ఉంటే..తెలంగాణ వచ్చేయండి అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు.
పెద్ద సంఖ్యలో పరిశ్రమలు రావడంతో బిలియన్ల మేర డాలర్లను పన్నులుగా వసూలు చేసిన సిలికాన్ వ్యాలీలో ఇప్పటికీ సరైన రోడ్లు లేవని, నిత్యం విద్యుత్ కోతలు, అరకొర నీటి సరఫరా, వినియోగించడానికి వీలు లేని ఫుట్ పాత్‌లు వేధిస్తున్నాయని రవీశ్ నరేశ్ తన ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. భారత్‌లోని చాలా పల్లె సీమలు ఇప్పుడు సిలికాన్ వ్యాలీ కంటే మెరుగ్గా ఉన్నాయని కూడా ఆయన కోట్ చేశారు.
ఈ ట్వీట్ చూసిన వెంటనే స్పందించిన కేటీఆర్.. తెలంగాణకు వచ్చేయండి అంటూ రిప్లై ఇచ్చారు. ఏమాత్రం ఆలోచించకుండా మూటాముల్లె సర్దుకుని హైదరాబాద్ వచ్చేయండని చెప్పిన కేటీఆర్.. అద్భుతమైన మౌలిక వసతులతో పాటు సామాజికంగానూ మెరుగైన పరిస్థితులు హైదరాబాద్ సొంతమని తెలిపారు. రాకపోకలకు ఈజీగా ఉండేలా ఎయిర్‌పోర్టు కూడా హైదరాబాద్ సొంతమని కూడా కేటీఆర్ తెలిపారు. ఇక తమ ప్రభుత్వం ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత వృద్ధి అనే మూడు అంశాల ప్రాతిపదికగా సాగుతోందని కేటీఆర్ గుర్తు చేశారు.