Imran Khan: పాక్ జాతీయ అసెంబ్లీలో గందరగోళం... ఏప్రిల్ 3కి వాయిదా పడిన సభ

Pakistan national assembly adjourned

  • ప్రధాని ఇమ్రాన్ పై విపక్షాల అవిశ్వాస తీర్మానం
  • నేడు సభలో చర్చ
  • అసంపూర్తిగా ముగిసిన చర్చ
  • తదుపరి ప్రధాని షాబాజ్ షరీఫ్ అంటున్న విపక్షాలు

పాకిస్థాన్ దిగువ సభలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రసాభాస చోటుచేసుకుంది. చర్చ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. విపక్షాలకు చెందిన 172 మందికి పైగా సభ్యులు సభకు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను కొనసాగించాల్సిందేనంటూ వారు పట్టుబట్టారు. "గో ఇమ్రాన్ గో" అంటూ నినాదాలతో సభను హోరెత్తించారు. 

అయితే, డిప్యూటీ స్పీకర్ చర్చకు అర్థాంతరంగా తెరదించారు. సభను ఏప్రిల్ 3కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు సభ పునఃప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. 

ఓవైపు సొంత పార్టీలో అసమ్మతి రాగం, మిత్రపక్షాలు కూడా దూరమవుతున్న తరుణంలోనూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. చివరి బంతి వరకు పోరాడతానంటూ తన క్రికెట్ స్ఫూర్తిని చాటే ప్రయత్నం చేస్తున్నారు.

పాక్ లో అసలేం జరిగిందంటే...

  • దేశంలో ఆర్థిక సంక్షోభానికి, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వమే కారణమని విపక్షాలు దుమ్మెత్తి పోశాయి.
  • విపక్షాలు మార్చి 8న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీ సచివాలయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.
  • ఈ అవిశ్వాస తీర్మానం పార్లమెంటు ఎదుటకు మార్చి 28న రాగా, ఏప్రిల్ 3న ఓటింగ్ చేపట్టాలని నిర్ణయించారు. 
  • పాక్ సైన్యం తనకు బాసటగా నిలుస్తుందని ఇమ్రాన్ ఖాన్ బాహాటంగా చెప్పుకున్నా, సైన్యం మాత్రం తటస్థంగా ఉంటామని స్పష్టం చేసింది.
  • విపక్షాలు మాత్రం అప్పుడే కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలోచన చేస్తున్నాయి.
  • ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగితే, తదుపరి ప్రధాని షాబాజ్ షరీఫ్ అంటూ పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో అంటున్నారు. షాబాజ్ షరీఫ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు.

Imran Khan
No Trust Motion
National Assembly
Pakistan
  • Loading...

More Telugu News