Imran Khan: అవిశ్వాస తీర్మానం వెనక్కి తీసుకోండి... జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తా: పాక్ విపక్షాలకు ఇమ్రాన్ ఖాన్ ఆఫర్
- ఇమ్రాన్ పై విపక్షాల అవిశ్వాస తీర్మానం
- ఆదివారంలోపు ఓటింగ్
- నేడు అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సొంత పార్టీలోనే అసమ్మతిని ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ కు, మిత్రపక్షం ఎంక్యూఎం కూడా దూరం జరిగింది.
ఈ నేపథ్యంలో, ఇమ్రాన్ ఖాన్ విపక్షాలకు తాజా ప్రతిపాదన చేశారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుంటే తాను జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తానని పేర్కొన్నారు. పాకిస్థాన్ దిగువ సభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో సభలో నేడు అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టారు.
పాక్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉన్నారు. సాధారణ మెజారిటీకి 172 మంది సభ్యుల ఓట్లు అవసరం. సొంతపార్టీలోని 12 మంది, మిత్రపక్షం ఎక్యూఎంకు చెందిన ఏడుగురు విపక్షాలకు మద్దతు ఇవ్వడం ఇమ్రాన్ కు ఇబ్బందికరంగా మారింది. ఇమ్రాన్ ను ప్రధాని పదవి నుంచి సాగనంపడానికి అవసరమైన బలాన్ని విపక్షాలు కూడగడుతున్నాయి.
ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీలోనూ అసమ్మతి గళం వినిపిస్తుండడం ఆయనకు ప్రధాన ప్రతిబంధకంగా మారింది. పాక్ రాజకీయాల్లో ముఖ్యభూమిక పోషించే సైన్యం మద్దతు కోల్పోవడంతో ఇమ్రాన్ గద్దె దిగడం ఖాయంగా కనిపిస్తోంది.