Tax: 100 శాతం చెత్త పన్ను వసూలు కాకుంటే ఊస్టింగే.. పార్వతీపురం పారిశుద్ధ్య కార్మికులకు తాఖీదులు
![parvathipuram municipality staff agitations on tax collection](https://imgd.ap7am.com/thumbnail/cr-20220330tn624483460ffc6.jpg)
- ఏప్రిల్ 6లోగా వంద శాతం పన్నులు వసూలు చేయాలి
- లేదంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం
- పారిశుద్ధ్య కార్మికులకు పార్వతీపురం మునిసిపల్ కమిషనర్ నోటీసులు
చెత్త పన్ను విధింపుపైనే కాకుండా ఆ పన్నును వసూలు చేస్తున్న అధికార యంత్రాంగంపైనా ఇప్పటికే ఏపీలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి సమయంలో 100 శాతం చెత్త పన్ను వసూలు కాకుంటే.. ఆ బాధ్యతలను భుజానికెత్తుకున్న పారిశుద్ధ్య కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ నోటీసులు జారీ అయిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నోటీసులపై పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం మునిసిపాలిటీలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మునిసిపాలిటీ పరిధిలో చెత్త పన్ను వసూలు బాధ్యతను పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించిన మునిసిపల్ కమిషనర్ వసూళ్లకు సంబంధించి టార్గెట్లు పెడుతున్నారట. మునిసిపాలిటీలో 100 శాతం చెత్త పన్నును ఏప్రిల్ 6లోగా వసూలు చేయాలని, లేని పక్షంలో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కమిషనర్ పారిశుద్ధ్య కార్మికులకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు అందుకున్న పారిశుద్ధ్య కార్మికులు కమిషనర్ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు.