Sri Balaji District: పద్మావతి నిలయంలోనే శ్రీ బాలాజీ కలెక్టరేట్.. భాను ప్రకాశ్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
- హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ భానుప్రకాశ్ పిటిషన్
- కలెక్టర్ చెట్టు కింద కూర్చుని పనిచేయలేరు కదా? అన్న సుప్రీం
- కలెక్టరేట్ వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కదా
- జిల్లాల పునర్విభజన అధికారం ప్రభుత్వానికి ఉందన్న సుప్రీంకోర్టు
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తిరుపతి కేంద్రంగా ఏర్పాటు కానున్న శ్రీ బాలాజీ జిల్లా కలెక్టరేట్‌కు ఎదురవుతున్న అవరోధాలు తొలగిపోయాయి. పద్మావతి నిలయంలోనే బాలాజీ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు పద్మావతి నిలయంలో బాలాజీ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటును అడ్డుకోవాలంటూ బీజేపీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కొట్టేసింది.
తిరుపతి పరిధిలోని తిరుచానూరులో టీటీడీ నిధులతో నిర్మించిన పద్మావతి నిలయాన్ని 'శ్రీ బాలాజీ జిల్లా' నూతన కలెక్టరేట్ కార్యాలయంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. పద్మావతి నిలయంలోనే బాలాజీ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటుకు హైకోర్టు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని దాఖలైన ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
కలెక్టరేట్ కార్యాలయం రావడం వల్ల ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది కదా? అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కలెక్టర్ చెట్టు కింద కూర్చుని పనిచేయలేరు కదా? అని వ్యాఖ్యానించిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి సముచిత గౌరవం ఇవ్వాలని పేర్కొంది. జిల్లాల పునర్విభజన చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.