Russia: మేమేమీ అమాయకులం కాదు.. రష్యాను నమ్మేది లేదు: జెలెన్ స్కీ

We do not believe Russia Says Ukraine Prez Zelensky
  • పూర్తిగా వెనక్కు వెళ్లాకే నమ్ముతామన్న జెలెన్ స్కీ 
  • ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచన
  • ఇంకా దాడులు కొనసాగించే అవకాశం ఉందని వ్యాఖ్య   
నిన్న టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన శాంతి చర్చలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ తాజాగా స్పందించారు. చర్చల ఫలితం సానుకూలంగానే ఉందని అన్నారు. అయితే, రష్యాను తాము ఇప్పుడే నమ్మలేమని, తమ ప్రజలేమీ అంత అమాయకులు కారని ఆయన స్పష్టం చేశారు. చర్చలకు సంబంధించిన ఫలితాలు చేతల్లో పూర్తిగా అమలైనప్పుడే నమ్ముతామని అన్నారు. 

ఉక్రెయిన్ సైనికుల ధైర్య సాహసాల వల్లే రష్యా సైన్యం వెనక్కు తగ్గుతోందని, అయినా, ఆ దేశాన్ని తాము నమ్మేది లేదని అన్నారు. పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదని, ప్రజలెవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. దేశంపై రష్యా ఇంకా దాడులు కొనసాగించే అవకాశం ఉందని చెప్పారు. 

రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ ప్రజలు చాలా నేర్చుకున్నారని, దేశ సార్వభౌమత్వంపై ఎప్పటికీ రాజీపడరని తేల్చి చెప్పారు. కాగా, ఉక్రెయిన్ రాజధాని కీవ్ సరిహద్దుల నుంచి రష్యా తన దళాలను చాలా తక్కువగా వెనక్కు తీసుకెళుతోందని, యుద్ధం నుంచి రష్యా ఇంకా పూర్తిగా తప్పుకోలేదని అమెరికా హెచ్చరించింది. ఉక్రెయిన్ లోని వేరే నగరాలపై దాడులను తీవ్రతరం చేసే ముప్పు పొంచి ఉందని చెప్పింది. కీవ్ కు కూడా ముప్పు పోలేదని హెచ్చరించింది.
Russia
Ukraine
Volodymyr Zelensky
Vladimir Putin

More Telugu News