Ukraine: వార్సాలో పిచాయ్.. ఉక్రెయిన్ శరణార్థులకు గూగుల్ మరింత సాయం ప్రకటన
![google ceo sundar pichai announces more aid for ukraine refugees](https://imgd.ap7am.com/thumbnail/cr-20220329tn6242f9a51d755.jpg)
- వార్సాలో గూగుల్ సీఈఓ పిచాయ్
- శరణార్ధులకు అందుతున్న సాయంపై పరిశీలన
- ఉక్రెయిన్, పోలండ్ అధికారులతోనూ భేటీ
- మరింత సాయానికి కూడా సిద్ధమేనని ప్రకటన
రష్యా మొదలెట్టిన యుద్ధం కారణంగా ఉక్రెయిన్ అతలాకుతలం అయిపోయింది. రష్యా దాడులను ఉక్రెయిన్ సైన్యం తిప్పికొడుతున్నా..బాంబుల మోతలకు భయపడిపోతున్న జనం ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్‌ను వీడారు. ఇలాంటి వారికి అండగా నిలిచేందుకు గూగుల్ ముందుకు వచ్చింది. ఉక్రెయిన్ శరణార్థుల సాయం కోసం ఇప్పటికే గూగుల్ 35 మిలియన్ డార్లను గూగుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మంగళవారం నాడు ఉక్రెయిన్ పొరుగు దేశం పోలండ్‌లో పర్యటించారు. ఉక్రెయిన్ నుంచి తరలివచ్చిన శరణార్ధులకు తొలి ఛాయిస్ పోలండేనన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్న పిచాయ్.. శరణార్థులకు మరింత మేర సాయం అందించడమెలా అన్న విషయంపై ఓ అవగాహనకు వచ్చేందుకే పోలండ్ పర్యటనకు వచ్చారు.
ప్రస్తుతం పోలండ్ రాజధాని వార్సాలో వున్న పిచాయ్ తాము అందిస్తున్న సాయాన్ని శరణార్థులకు చేరవేసే యంత్రాంగం పనితీరును పరిశీలించారు. అంతేకాకుండా ఇటు పోలండ్‌తో పాటు అటు ఉక్రెయిన్‌కు చెందిన అధికారులతోనూ చర్చలు జరిపారు. ఉక్రెయిన్ శరణార్థుల కోసం మరింత సాయం అందించేందుకు కూడా గూగుల్ సిద్ధంగానే ఉందని ఈ సందర్భంగా పిచాయ్ ప్రకటించారు.