Deepak Hooda: అర్ధసెంచరీలతో రాణించిన దీపక్ హుడా, ఆయుష్ బదోని... లక్నో 158-6
- ఐపీఎల్ లో కొత్త జట్ల పోరు
- గుజరాత్ వర్సెస్ లక్నో
- మొదట బ్యాటింగ్ చేసిన లక్నో
- 29 పరుగులకే 4 వికెట్లు డౌన్
- ఆదుకున్న దీపక్ హుడా, ఆయుష్ బదోని
ఐపీఎల్ లో అరంగేట్రం చేస్తున్న లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తొలి విజయం కోసం ఉరకలేస్తున్నాయి. ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్ తొలి బంతికే కెప్టెన్ కేఎల్ రాహుల్ డకౌట్ కావడంతో లక్నో శిబిరం దిగ్భ్రాంతికి గురైంది. రాహుల్ ను అవుట్ చేసిన షమీ అదే ఊపులో డికాక్ (7), మనీష్ పాండే (6)లను కూడా అవుట్ చేయడంతో లక్నో కష్టాల్లోపడింది. మరోవైపు వరుణ్ ఆరోన్ కూడా విజృంభించి ఎవిన్ లూయిస్ (10)ని పెవిలియన్ చేర్చాడు.
ఈ దశలో దీపక్ హుడా (55), ఆయుష్ బదోని (54) అద్భుతంగా ఆడి జట్టు స్కోరును 100 మార్కు దాటించారు. లక్నో జట్టు ఆ మాత్రం స్కోరు చేసిందంటే వీళ్లద్దరి చలవ వల్లే. ఆఖర్లో కృనాల్ పాండ్యా (13 బంతుల్లో 21 నాటౌట్) ధాటిగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో షమీ 3, వరుణ్ ఆరోన్ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.