AP High Court: హైకోర్టులో వివేకా కేసు విచారణ... వివేకా కూతురు ఇంప్లీడ్ పిటిషన్‌పై వాదనలు
- శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ
- తనను ఇంప్లీడ్ చేసుకోవాలన్న వివేకా కూతురు
- ప్రాతిపదిక ఏమిటని హైకోర్టు ప్రశ్న
- పూర్తి వివరాలతో పిటిషన్ దాఖలు చేస్తానన్న సునీత
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక నిందితుడు శివశంకర్‌రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఈ కేసులో తనను ఇంప్లీడ్ చేసుకోవాలంటూ వివేకా కూతురు డాక్టర్ సునీత కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు ఆమె అదనపు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సునీతకు హైకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. అసలు ఏ ప్రాతిపదికన శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణలో ఆమెను ఇంప్లీడ్ చేసుకోవాలంటూ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందించిన సునీత.. పూర్తి వివరాలతో మరో పిటిషన్ దాఖలు చేస్తానని ఆమె తెలపడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది.