Parliament: లోక్ సభలో కొత్త బిల్లు.. పోలీసులకు మరింత పవర్
- సభలో నేర ప్రక్రియ గుర్తింపు బిల్లు ప్రతిపాదన
- ప్రవేశపెట్టేందుకు ఓటింగ్ నిర్వహించిన స్పీకర్
- కాంగ్రెస్ సహా విపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు
- అనుకూలంగా మెజారిటీ ఓట్లు రావడంతో సభలో బిల్లు ఎంట్రీ
పార్లమెంటు బడ్జెట్ మలి విడత సమావేశాల్లో భాగంగా సోమవారం నాటి లోక్ సభ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే.. నేరాల దర్యాప్తులో పోలీసులకు మరింత మేర పవర్ దఖలు పడనుంది.
ఇక ఈ కొత్త బిల్లు విషయానికి వస్తే.. నేర ప్రక్రియ గుర్తింపు బిల్లు పేరిట కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఈ బిల్లును సోమవారం నాటి సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయనను అడ్డుకున్న విపక్షాలు.. కీలకమైన ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే విషయంలో ఓటింగ్ నిర్వహించాలంటూ పట్టుబట్టాయి. ఈ ప్రతిపాదనకు సరేనన్న స్పీకర్ ఓటింగ్‌కు అనుమతించారు. ఓటింగ్‌లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా 120 మంది ఎంపీలు ఓటు వేయగా, వ్యతిరేకంగా 58 మంది ఎంపీలు ఓటేశారు.
సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా మెజారిటీ సభ్యులు ఓటు వేయడంతో బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు స్పీకర్ అనుమతించారు. ఆ వెంటనే మంత్రి అజయ్ మిశ్రా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే.. ఇకపై నిందితుల నుంచి పకడ్బందీగా ఆధారాల సేకరణకు అనుమతి దక్కినట్టే. అదే సమయంలో దర్యాప్తులో భాగంగా పకడ్బందీ ఆధారాల సేకరణకు పోలీసులకు వీలు చిక్కుతుంది. అంటే దర్యాప్తులో పోలీసులకు మరింత మేర పవర్ దఖలు పడినట్టేనన్నమాట.