BJP: రేపు తెలంగాణకు బీజేపీ కీలక నేత.. రాష్ట్ర నేతల సమన్వయంపై ఫోకస్
![bjp key leader bl santosh comes telangana tomorrow](https://imgd.ap7am.com/thumbnail/cr-20220328tn6241874972af8.jpg)
- బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ హైదరాబాద్ రాక
- పార్టీలో నేతల సమన్వయ లోపంపై అధ్యయనం
- జాతీయ నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్న సంతోష్
బీజేపీకి సంబంధించి తెలంగాణ శాఖ నేతల మధ్య అభిప్రాయ భేదాలతో పాటు సమన్వయ లోపం ఉన్నట్లుగా ఆ పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఇటీవలే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం రెండు పర్యాయాలు రహస్యంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న జాతీయ నాయకత్వం అప్పటికప్పుడు ఆ సమస్య సద్దుమణిగేలా చర్యలు చేపట్టినా.. అసలు సమస్య ఎక్కడుందన్న విషయంపై ఇప్పుడు దృష్టి సారించింది.
ఈ దిద్దుబాటు చర్యల్లో భాగంగా రేపు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను బీజేపీ అధిష్ఠానం తెలంగాణకు పంపనుంది. మంగళవారం హైదరాబాద్ రానున్న సంతోష్.. పార్టీ రాష్ట్ర శాఖకు చెందిన పలువురు కీలక నేతలతో వరుసగా భేటీ కానున్నారు. అంతేకాకుండా బీజేపీ నేతల మధ్య అభిప్రాయ భేదాలకు గానీ, సమన్వయ లోపానికి గానీ ఇదీ కారణమంటూ ఆయన ఓ నివేదికను రూపొందించి జాతీయ నాయకత్వానికి అందించనున్నారు.