Jagan: బస్సు ప్రమాద మృతుల‌కు ఎక్స్‌గ్రేషియా ప్రక‌టించిన‌ జగన్‌.. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప‌లువురి దిగ్భ్రాంతి

jagan announces exgratia

  • చిత్తూరు జిల్లా బాకరాపేటలో గ‌త రాత్రి ఘోర బస్సు ప్రమాదం
  • మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా 
  • గాయాల‌పాలైన వారికి రూ.50 వేల చొప్పున ప్ర‌క‌ట‌న‌
  • మెరుగైన వైద్యం అందించాల‌ని జ‌గ‌న్ ఆదేశం

చిత్తూరు జిల్లా బాకరాపేటలో గ‌త రాత్రి ఘోర బస్సు ప్రమాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం జ‌గ‌న్ స్పందిస్తూ మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు. ఈ ఘోర‌ ప్రమాదానికి కారణాలపై ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మ‌రం చేయాల‌ని, గాయ‌ప‌డ్డవారికి మెరుగైన వైద్యం అందించాల‌ని చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న అధికారుల‌తో మాట్లాడారు. 

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారని జ‌గ‌న్‌కు అధికారులు తెలిపారు. తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆసుప‌త్రుల్లో బాధితుల‌కు చికిత్స అందిస్తున్నామని వివ‌రించారు. ఈ ప్ర‌మాదంలో  మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని జ‌గ‌న్ చెప్పారు. 

అలాగే, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని అన్నారు. మ‌రోవైపు, రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి పరామర్శించారు. బాధితుల‌కు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆయ‌న‌కు రుయా సూపరిండెంట్ డాక్టర్ భారతి వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను మంత్రి అదేశించారు. 

ఈ రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమ‌ని, పెళ్లి వేడుక స‌మ‌యంలో జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందని అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయ‌న అన్నారు. 

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఏపీ పీసీసీ చీఫ్ శైలజనాథ్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాల‌కు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. బాధిత‌ కుటుంబాలను ఆదుకోవాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం రహదారుల భద్రతపై దృష్టి సారించాలని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News